హోమ్ /వార్తలు /క్రైమ్ /

కరీంనగర్ లో కలకలం రేపుతున్న చెద్దర్ గ్యాంగ్.. మొబైల్ షాప్ లో దూరి రూ. 10 లక్షల విలువైన ఫోన్లు చోరీ..

కరీంనగర్ లో కలకలం రేపుతున్న చెద్దర్ గ్యాంగ్.. మొబైల్ షాప్ లో దూరి రూ. 10 లక్షల విలువైన ఫోన్లు చోరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు దుకాణం పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్నట్లు నటించగా, మరో ముగ్గురు దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

  • News18
  • Last Updated :

దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. మారుతున్న కాలానికి తగ్గట్టు దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఎంత చేసినా దొంగ దొరకక మానడుగా.. సీసీ టీవీల పుణ్యమా అని.. ఈ రోజుల్లో దొంగతనం జరిగిన కొద్ది గంటల్లోనే వారి బండారం బయటపడుతున్నది. తాజాగా కరీంనగర్ లో ఓ ముఠా చేసిన దొంగతనం స్థానికంగా సంచలనం రేగింది. స్థానికంగా ఉన్న ఒక మొబైల్ విక్రయదుకాణంలో జరిగిన ఈ దొంగతనం.. చెద్దర్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ దుకాణంలోకి దూరి.. రూ. 10 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్లను అపహరించుకుపోయారు దుండగులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి మంచిర్యాల చౌరస్తా మార్గమధ్యంలో ఉన్న సెల్ - బే సంస్థకు చెందిన దుకాణంలో ఈ చోరీ జరిగింది. శనివారం రాత్రి సిబ్బంది దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దుకాణం తెరిచేందుకు నిర్వాహకులు వచ్చి చూడగా షెటర్ తెరిచి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సదరు యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దుకాణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. ఈ చోరీలో మొత్తం ఆరుగురు యువకులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు దుకాణం పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్నట్లు నటించగా, మరో ముగ్గురు దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. షాపులో ఉన్న రూ. 10.21 లక్షల విలువ గల 80 సెల్ ఫోన్లను దొంగలు అపహరించుకుపోయారు. చోరీ అనంతరం ముగ్గురు యువకులు కోర్టు చౌరస్తా మీదుగా జగిత్యాల వైపు, మరో ముగ్గురు మంచిర్యాల మార్గం వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. సెల్ - బే సంస్థ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు..

దొంగల కోసం 11 బృందాలు

సెల్ - బే లో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునేందుకు మొత్తం 11 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2017 లో కరీంనగర్ ఆర్ అండ్ బీ వసతి గృహం సమీపంలోని దుకాణంలో చెద్దర్ గ్యాంగ్ ఇదే తరహా చోరీకి పాల్పడింది. వారిని గుర్తించిన కరీంనగర్ పోలీసు బృందం బిహార్‌లో వారిని పట్టుకుని అరెస్టు చేశారు. గత పోలికలతో చోరీ జరగడంతో పోలీసులు తాజా దొంగతనం కూడా చెద్దర్ గ్యాంగ్ పనేనని అనుమానిస్తున్నారు. చోరీకి పాల్పడిన దొంగలను గుర్తించి వారిని పట్టుకునేందుకు కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ తో సహా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించి అక్కడికి వెళ్లారు.

First published:

Tags: Crime, Crime news, Karimangar, Mobiles, Theft

ఉత్తమ కథలు