THIEVES RETURN STOLEN IDOLS TO 300 YEAR OLD BALAJI TEMPLE AT CHITRAKOOT IN UTTAR PRADESH CLAIMING HAUNTED BY SCARY DREAMS MKS
Chitrakoot: శ్రీవారి విగ్రహాలు దొంగిలించాక భయానక పీడకలలు.. ఔరంగజేబు కట్టించిన ఏకైక ఆలయం అది!
తిరిగొచ్చిన దేవతామూర్తులు, దొంగల లేఖ
350 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయం నుంచి మొత్తం 16విగ్రహాలను తస్కరించిన దొంగల బృందాన్ని పీడకలలు వెంటాడాయి. ఆ కలలకు భయపడిపోయి దెబ్బకు దేవుడికి దండం పెట్టుకోవాల్సి వచ్చింది. వివరాలివే..
పాపభీతిని, దేవుడంటే భయాన్ని, మంచి-మానవత్వాన్ని వదిలేస్తేనే దొంగలుగా రాణించగలరని చోర నీతి చెబుతుంది. కానీ ఆఫ్ట్రాల్ దొంగలు కూడా మనుషులే కదా. పాపభీతి నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. ఎక్కడో ఓ చోట బ్రౌక్ డౌన్ కావాల్సిందే. ఈ కథనంలోనూ దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం నుంచి మొత్తం 16విగ్రహాలను తస్కరించిన దొంగల బృందాన్ని పీడకలలు వెంటాడాయి. ఆ కలలకు భయపడిపోయి దెబ్బకు దేవుడికి దండం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎత్తుకెళ్లిన విగ్రహాలను మళ్లీ ఆలయానికి తీసుకొచ్చి, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో లేఖను కూడా వదిలేసి వెళ్లారా దొంగలు..
ఉత్తర్ప్రదేశ్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ వాటిని తిరిగి ఆలయ పూజారి ఇంటి సమీపంలో వదిలేయడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్రకూట్ జిల్లా తరౌనాలోని పురాత బాలాజీ ఆలయంలో ఈ ఘటన జరిగింది.
350 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజానికి తన 49 ఏళ్ల పరిపాలనలో (అతను 88వ ఏట చనిపోయాడు) ఎన్నో హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు.. విచిత్రంగా చిత్రకూట్ లోని బాలాజీ ఆలయ నిర్మాణానికి భారీగా నిధులిచ్చాడు. ఈ మేరకు జారీ చేసిన ఫర్మానా(అధికారిక పత్రం) ఇప్పటికీ ఆ ఆలయంలో ఉంది. ఔరంగజేబు కట్టించిన దాదాపు ఏకైక హిందూ ఆలయం శ్రీవేంకటేశ్వరుడిది కావడం, అది కూడా తిరుపతి నుంచీ సుదూరాన ఉన్న చిత్రకూట్ లో ఉండటం విశేషం. చరిత్రలో నుంచి వర్తమానంలోకి వస్తే..
ఔరంగజేబు ఫర్మానా చూపుతోన్న బాలాజీ ఆలయ పూాజారి (పాత ఫొటో)
చిత్రకూట్ తరౌనాలోని పురాతన బాలాజీ ఆలయం ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయింది. సౌకర్యాలు సరిగా లేక భక్తుల రాకపోకలు కూడా తగ్గాయి. ఇదే అదనుగా భావించిన ఓ దొంగల ముఠా ఆ చారిత్రక ఆలయంలో చోరీకి పాల్పడింది. బాలాజీ ఆలయం నుంచి మే 9న రాత్రి రూ.కోట్ల విలువైన 16 విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. మరుసటిరోజు ఆలయం తెరిచిచూసి షాకైన పూజారి మహంత్ రామ్బాలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా మొన్న ఆదివారం అద్భుతం జరిగిందా? అన్నట్లుగా దేవుడి విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం అయ్యాయి..
పురాతన బాలాజీ ఆలయం నుంచి చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ఆలయ అర్చకుడిని చేరుకున్నాయి. ఆదివారం నాడు పూజారి మహంత్ నిద్రలేచేసరికి ఆయన ఇంటికి సమీపంలో ఒక గోనె సంచిలో విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటితోపాటు ఓ లేఖ కూడా బయటపడినట్లు అధికారి తెలిపారు. ‘దొంగతనం చేసిన రాత్రి నుంచి పీడకలలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. వారం రోజులుగా నిద్రపడితే ఒట్టు. ఈ భయంతో మేం బతకలేం. అందుకే విగ్రహాలను తిరిగిస్తున్నాం’ అని దొంగలు వదిలిన లేఖలో రాసుంది. మొత్తానికి చోరీకి గురైన విగ్రహాల్లో రెండు తప్ప మిగతావన్నీ తిరిగి ఆలయాన్ని చేరడంతో మళ్లీ పూజలు కొనసాగుతున్నాయి. కాగా, ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.