Attack on Volunteer: వాలంటీర్ ను దారుణంగా కొట్టి.. పింఛన్ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు!

Ananthapur: అనంతపురం జిల్లాలో గురువారం దారుణం చోటు చేసుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్న వాలంటీర్ కళ్లల్లో కొందరు కారం చల్లి దాడికి దిగారు. అతని వద్ద ఉన్న పంఛన్ డబ్బును ఎత్తుకెళ్లారు.

news18-telugu
Updated: October 1, 2020, 6:36 PM IST
Attack on Volunteer: వాలంటీర్ ను దారుణంగా కొట్టి.. పింఛన్ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతీ నెల ఒకటవ తేదీ రోజే వృద్ధులకు పింఛన్లను వాలంటీర్ల ద్వారా అందించే కార్యక్రమాన్ని జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే పింఛన్లు ఇవ్వడానికి బయలుదేరిన వాలంటీర్ పై కొందరు దాడికి దిగిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఒకటవ తారీఖు సందర్భంగా వృద్ధులకు పింఛన్లు పంచేందుకు డబ్బులతో వెళ్తున్న వాలంటీర్ కళ్లల్లో కారం చల్లిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణంలోని శివపురలో వీరప్ప అనే వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం వీరప్ప వృద్ధులకు పంపిణీ చేసేందుకు పింఛన్ల సొమ్మును తీసుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు అతడిపై దాడికి దిగారు. కళ్లల్లో కారం చల్లి పింఛన్ దారులకు పంపిణీ చేసేందుకు అతడు తీసుకెళ్తున్న రూ. 43 వేలను లాక్కొని పారిపోయారు. ఈ క్రమంలో దుండగులు దారుణంగా కొట్టడంతో వాలంటీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వాలంటీర్ నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

పక్కా ప్లాన్ ప్రకారమే?

పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తున్న వాలంటీర్ పై దాడి చేసి డబ్బులు లాక్కెల్లిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందన్న అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. తెలిసిన వాళ్లే ఇలా దాడి చేసి డబ్బులు దోచుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ నిర్వహిస్తున్నారు. మరో వైపు ఈ రోజు తమకు పింఛన్ డబ్బులు అందుతాయని ఆశించిన స్థానిక లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. తమకు అందాల్సిన పైసలు దొంగలపాలయ్యాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. మళ్లీ తమకు డబ్బులు అందేది ఎప్పుడో అన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.

గత నెల 25న సైతం చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్ పై దాడి జరిగింది. బుచ్చినాయుడు కండ్రిగ మండలం గాజుల పెల్లురు గ్రామంలో వాలంటీర్ ప్రకాష్, అతని బంధువు రమేష్ పై కిరాయి గుండాలు కత్తులతో దాడికి దిగారు. దీంతో క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో వాలంటీర్ వివక్ష చూపుతున్నాడని, దీంతో ఉద్దేశ పూర్వకంగా కొందరు దాడి చేయించారని గ్రామస్తులు ఆ సమయంలో చర్చించుకున్నారు. అయితే వాలంటీర్ పై దాడి జరగడానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నిస్వార్థంగా సేవ చేస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 1, 2020, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading