బహుమతుల పేరిట మతులు పోగొడుతున్న ఘరానా దొంగ..

ఊళ్లల్లో వాయిదాల పద్దతిలో రైస్ కుక్కర్లు, మిక్సీలు, కుర్చీలు, టీవీల వంటివి అమ్మేవాళ్లు గుర్తున్నారా..? అలా అమ్మే ఒక వ్యక్తి బహుమతుల పేరు చెప్పి జనాల మతులు పోగోడుతున్నాడు.

news18
Updated: November 14, 2020, 8:06 AM IST
బహుమతుల పేరిట మతులు పోగొడుతున్న ఘరానా దొంగ..
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: November 14, 2020, 8:06 AM IST
  • Share this:
‘మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. బంగారం లాంటి లక్కీ డ్రా లో మీరు గెలిచారు. మా రైస్ కుక్కర్ల సంస్థ వాళ్లు వేయి చిట్టీలు డ్రా తీస్తే అందులో మీ పేరు వచ్చింది. మీరు పెద్ద బహుమతి గెలుచుకున్నారు..’ అంటూ మాయమాటలు చెప్తే వారంతా నిజమేనేమో అనుకున్నారు. తమకు నిజంగానే బంపర్ లాటరీ తగిలిందేమో అనుకున్నారు. ఆ అమాయక జనాలను తీసుకొచ్చి వేరే దగ్గర ఉంచి.. సదరు బాధితుల ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలను కొట్టేస్తున్నాడు ఒక ఘరానా దొంగ. హైదరాబాద్ పోలీసులు ఈ లక్కీ డ్రా ల దొంగ ఆట కట్టించారు. ఏదో చిన్నా చితక దొంగతనాలు కాదండోయ్.. ఇతగాడు ఇప్పటిదాకా 33 తులాల బంగారాన్ని నొక్కేశాడు. అంటే ప్రస్తుత రేటు ప్రకారం ఎంతవుతుందో లెక్కేయండి. ఇక అసలు విషయానికొస్తే....

మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్ అహ్మద్ షేక్ అలియాస్ అఫ్తాబ్ ను శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని దగ్గర్నుంచి 33 తులాల బంగారం... రూ. 20 వేల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై సీపీ అంజనీ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర వాస్తవ్యుడైన అఫ్తాబ్.. 11 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అలా మెల్లమెల్లగా స్టీలు గిన్నెలు, రైస్ కుక్కర్లు, మిక్సీలు వంటివి నగరానికి సమీపాన ఉన్న గ్రామాలకు తీసుకెళ్లి అక్కడ వాయిదాల పద్దతిలో అమ్మేవాడు. వారందరి దగ్గర నమ్మకంగా ఉంటూ వారి వద్ద ఉన్న బంగారాన్ని కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు.

ఆలోచన రాగానే ఈ పథకాన్ని ముందుగా పైలెట్ ప్రాజెక్టు గా తన సొంతూరైన మహారాష్ట్రలోని కిన్వత్ లో ప్రయోగించాడు. కానీ ఇది అక్కడ అంతగా సక్సెస్ కాలేదు. పోలీసులు తీసుకెళ్లి వారి స్టైల్ లో మర్యాదలు చేసి పంపించారు. అనంతరం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులోనూ జైలుశిక్ష అనుభవించాడు. నాలుగేళ్ల క్రితం మళ్లీ భాగ్యనగరానికి చేరుకున్నాడు.

ఈసారి మన ఘరానా దొంగ.. నాందేడ్, సంగారెడ్డి, మెదక్ సిద్దిపేట వంటి జిల్లాలలో గృహిణులకు సామాన్లు ఇవ్వసాగాడు. ఏ వస్తువు తీసుకెళ్తే తాను ఆ వస్తువు తాలుకు సంస్థ ప్రతినిధినని చెప్పుకునేవాడు. ఈ వస్తువు కొన్నందుకు గానూ తమ సంస్థ తీసిన లక్కీ డ్రాలో మీ పేరుందని వారిని నమ్మించేవాడు. ఆ గిఫ్ట్ ను తీసుకునేందుకు వారిని ఏదో ఒక కార్యాలయానికి తీసుకుపోయేవాడు. అంతకంటే ముందే.. వారి ఒంటి మీద ఉన్న నగలు, ఆభరణాలను ఇంట్లోనే దాచాలని.. అవి ఉంటే ధనవంతులు అనుకుని సదరు సంస్థల వాళ్లు గిఫ్ట్ లు ఇవ్వరని నమ్మించేవాడు.

బాధితులకు కార్యాలయాల్లో కూర్చోబెట్టి.. చిన్న పనుందుని బయటకెళ్లేవాడు. తిరిగి నేరుగా ఆ బాధితుల ఇంటికి వెళ్లి పిల్లలకు... మీ అమ్మ చెప్పిందని బంగారం తీసుకుపోయేవాడు. ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇక అంతే... ఈ క్రమంలో చార్మినార్ కు చెందిన ఒక ఇల్లాలిని ఇలాగే మోసం చేయడానికి యత్నించాడు. కానీ ఆమె చాకచక్యంగా వ్యవహరించి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఫ్తాబ్ ఆట కట్టించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం చెప్పుకొచ్చాడు. నిందితుడి దగ్గర్నుంచి బంగారం తో పాటు ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. అఫ్తాబ్ ను రిమాండ్ కు తరలించారు.
Published by: Srinivas Munigala
First published: November 14, 2020, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading