(P.Mahender,News18,Nizamabad)
ఆస్తి కోసం సెల్ టవర్ (Cell Tower) ఎక్కి హల్చల్ చేశాడో యువకుడు. భూమిలో తండ్రి (Father) తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. భూమిలో తనకు వాటా ఇవ్వకుంటే దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంటానని బెదిరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి సుమారు 4 గంటలపాటు అక్కడే ఉండి కిందికి దూకుతా అంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంతోష్ ను సముదాయించారు.
అలాగే సంతోష్ తండ్రి రాములు, భార్య గౌతమి, ఇద్దరు పిల్లలను సెల్ టవర్ వద్దకు రప్పించి సంతోష్ తో మాట్లాడించారు. 4 గంటల అనంతరం సంతోష్ సెల్ టవర్ దిగి కిందికి వచ్చాడు. సంతోష్ కామారెడ్డి పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని చేస్తూ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గ్రామంలో ఉన్న ఎకరం భూమిని సంతోష్ తండ్రి రాములు విక్రయించి అందులో సంతోష్ కు వాటా ఇవ్వలేదని తెలిపారు. అప్పులు ఉండడంతో ఆ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేశారు. అయితే ప్రస్తుతం ఉన్న మరో ఎకరం భూమిలో కూడా తనకు వాటా ఇవ్వానని చెప్పడంతో భూమి విషయమై తండ్రితో మాట్లాడతానని భార్యకు చెప్పి గురువారం సంతోష్ నందివాడకు ఇంట్లో నుంచి బయల్దేరాడు.
గ్రామానికి వెళ్లి తండ్రి రాములుతో మాట్లాడి తన మాట వినక పోవడంతో కామారెడ్డికి చేరుకొని పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో గల సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ ఎక్కేముందు 100 నెంబర్ కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నారని సమాచారం ఇచ్చాడు. అలాగే భార్య గౌతమికి సైతం ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో గౌతమి తన పిల్లలను తీసుకొని సెల్ టవర్ వద్దకు వచ్చి సంతోష్ ను కిందికి దిగాలని వేడుకుంది. సుమారు 4 గంటల అనంతరం సంతోష్ సెల్ టవర్ దిగి కిందికి రావడంతో పోలీసులు సంతోష్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మా మామయ్య మా వంతుకు వచ్చే ఆస్తిలో వాటా ఇవ్వలేదని నా భర్త సెల్ టవర్ ఎక్కుతున్నాను తనతో చెప్పాడని భార్య గౌతమి చెబుతుంది.
ఎకరం భూమి అమ్మారు.. అయితే అందులో మాకు రూపాయి కూడా ఇవ్వలేదు.. దీంతో సంతోష్ మా నాన్న తో మాట్లాడి వస్తాను అని వెళ్ళాడు.. అయితే అక్కడ ఏమి జరిగిందో తనకు తెలియదని ఆమె పేర్కొంది. తమకు న్యాయం చేయండంటూ ఆమె కోరుతోంది. అతడి భర్త ఏదైనా చేసుకుంటాడేమో అని.. ఆమె సెల్ టవర్ వద్దనే బిక్కుబిక్కుమనుకుంటూ.. తన బిడ్డను ఎత్తుకొని చూస్తూ ఉండిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nizamabad, Nizamabad District