తిరువళ్లూరు: కొన్ని సందర్భాల్లో మరణం హఠాత్తుగా వస్తుంది. అప్పటి దాకా సంతోషంగా గడిపిన వారి జీవితాలను మృత్యువు అర్థాంతరంగా ముగించేస్తుంది. హఠాన్మరణం ఎంత బాధాకరంగా ఉంటుందో.. ఎంత మంది జీవితాల్లో విషాదాన్ని నింపుతుందో పునీత్ రాజ్‌కుమార్ అస్తమయం మనకు చెప్పకనే చెబుతోంది. అనారోగ్యంతో మంచాన పడి చనిపోయిన వారి కంటే అప్పటి దాకా ఆనందంగా మన మధ్య గడిపి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వారి గురించి తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి జరిగి వారం కూడా గడవక ముందే నవ దంపతులు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువుకు బలయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో ఒక్కసారిగా చీకట్లు కమ్మేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రాణీపేట్ జిల్లా అరక్కోణం ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ (31) మెడికల్ వ్యాపారం చేస్తుంటాడు.
మనోజ్ కుమార్‌కు ఇటీవల తాంబరం ప్రాంతానికి చెందిన కార్తీక అనే యువతితో అక్టోబర్ 28న పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. రెండు కుటుంబాలు పెళ్లి వేడుక జరగడంతో సంతోషంగా ఉన్నాయి. నవ వధూవరులు వధువు ఇంట్లో మూడు రోజులు ఉన్నారు. అక్టోబర్ 31న రాత్రి సమయంలో అరకోణంలో ఉన్న మనోజ్ ఇంటికి కారులో బయల్దేరారు. కొత్తగా పెళ్లైన మనోజ్, కార్తీక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళుతున్నారు. మనోజ్ కారు నడుపుతున్నాడు.
కారులో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్లు ప్రయాణిస్తున్న కారు తిరువళ్లూరు సమీపంలోని పూందమల్లి-అరకోణం రహదారిపై వెళుతుండగా చెన్నైకి వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి వేగంగా మనోజ్, కార్తీక ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కార్తీక కూడా మనోజ్ పక్కనే కారులో ముందు సీటులో కూర్చోవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పాట్‌లోనే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీసులు ఈ ఘటన గురించి తెలిసి స్పాట్‌కు చేరుకున్నారు.
పోలీసులు వచ్చే లోపే లారీ డ్రైవర్ భయంతో ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి పరారయ్యాడు. పోలీసులు రెండు గంటలు శ్రమించి లారీకి, కారుకు మధ్య చిక్కుకున్న మనోజ్, కార్తీక మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను పోలీసులు తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తగారింట్లో మూడు రోజులు నిద్ర చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఇద్దరి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదించారు. పోలీసులు పరారైన ఆ లారీ డ్రైవర్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు. లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడమే ప్రమాదానికి కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టేందుకు వెళుతున్న కార్తీక జీవితంలో, పెళ్లి చేసుకుని భార్యతో దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా గడపాలని భావించిన మనోజ్ జీవితంలో పెను విషాదాన్ని మిగిల్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Car accident, Crime news, Newly Couple, Road accident