కోయంబత్తూర్: ‘ఒకేఒక్కడు’ సినిమాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయాల్సిన డాక్టర్ విడిగా ఓ క్లినిక్ పెట్టుకుని విధులను నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి ఆ డాక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తాడు. ఈ సీన్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అది సినిమా కాబట్టి ఒక్కరోజు ముఖ్యమంత్రి తనకు ఉన్న అధికారాలతో విధుల్లో అలసత్వం వహించిన ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేశాడు. కానీ.. ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా క్లినిక్‌లు నడుపుతూ, వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్స్‌గా పనిచేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
అంతేకాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన పేదవారిని తాము పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరేలా చేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే తమిళనాడులోని తిరుపూరులో తాజాగా వెలుగుచూసింది. సదరు మహిళా డాక్టర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో విషయం అందరికీ తెలిసింది.
ఇది కూడా చదవండి: Husband: ఈమె భర్త వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో అయ్యగారు ఏం చేశారో చూడండి..
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపూరు జిల్లాలోని మదతుకుళం ప్రాంతానికి చెందిన రాజరాజేశ్వరి(24), మరుదముత్తు(33) భార్యాభర్తలు. రోజూ కూలి పనులకు వెళుతూ ఉండేవారు. గర్భంతో ఉన్న రాజరాజేశ్వరికి ఈ మధ్య ఒకరోజు కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆమెకు ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో స్కాన్ చేయగా.. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్లుగా తెలిసింది. వెంటనే.. ఆమెను చికిత్స నిమిత్తం ఉదుమలపేట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరి నాలుగు రోజులయింది. మృత శిశువు కడుపులో ఉండిపోవడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించింది.
ఆమెకు వైద్యం చేసిన మహిళా డాక్టర్ జ్యోతిలక్ష్మి ఈ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని.. తనకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఉందని బాధిత కుటుంబానికి చెప్పి ఒత్తిడి చేసి రాజరాజేశ్వరిని ఆ ఆసుపత్రికి తరలించింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఇదే ప్రభుత్వాసుపత్రి డాక్టర్ జ్యోతిలక్ష్మి రాజరాజేశ్వరికి వైద్యం చేసి కడుపులో ఉన్న మృత శిశువు తొలగించింది. వైద్యం చేసినందుకు 37,000 రూపాయలను ఆ కుటుంబం నుంచి వసూలు చేసింది. రోజువారీ కూలి పనులకు వెళ్లే ఆ కుటుంబానికి అంత డబ్బు కట్టడానికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయింది.
ఇది కూడా చదవండి: Newly Married: ఈ జంటకు పెళ్లి జరిగి ఆరు నెలలయింది.. ఇన్ని రోజుల తర్వాత ఏమైందంటే..
ఈ డాక్టర్ ప్రైవేట్ ఆసుపత్రి బాగోతం.. బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయం తెలిసి బాధిత కుటుంబంతో కలిసి కొందరు సదరు మహిళా డాక్టర్ జ్యోతిలక్ష్మిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన తిరుపూర్ కలెక్టర్ ఎస్.వినీత్‌కు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసే అవకాశం ఉన్నప్పటికీ మాయమాటలు చెప్పి పేద వాళ్లను ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందేలా చేసి సదరు డాక్టర్ సొమ్ముచేసుకుంటున్నట్లు తేలింది. బాధిత కుటుంబం నుంచి వైద్యం పేరుతో వసూలు చేసిన రూ.37,000 డబ్బును ఆ మహిళా డాక్టర్ చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. పేదవారి బలహీనతలను అడ్డం పెట్టుకుని వైద్యులు ఇలా దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.