(Veeranna. K , News 18, Medak)
రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ, తంత్రాలు, భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు. తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు ,ఆ తర్వాత మరణాలు, మరోవైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.. ఏది జరిగినా వారే కారణమనే సాంఘిక పరిస్థితులు మొత్తం మీద పదుల సంఖ్యలో హత్యలు కొనసాగుతున్నాయి. పల్లెల్లో మూఢనమ్మకాలు (superstitions) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చేతబడి (suspicion of doing mantras) చేస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిపై అయినవారే హత్యాయత్నానికి (Murder attempt) పాల్పడ్డారు. అయితే అందులో ఆ బాధితుడి సోదరి (Sister) కూడా ఉండటం సభ్యసమాజం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ సంఘటన మెదక్ (Medak) జిల్లా చల్మెడ గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ (Sudharshan) స్థానిక బీడీ కార్ఖానాలో ఏజెంట్ పని చేస్తున్నాడు. ఇతడికి భార్య బాలమణి, కుమారుడు హరికృష్ణ ఉన్నారు. సుదర్శన్ చెల్లెలు శ్రీగాథ భూదేవి కుటుంబంతో సహా ఇదే గ్రామంలో ఉంటున్నారు. ఆమె పెద్ద కుమారుడు చంద్రశేఖర్ భార్య రుచిత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటున్నారు. దీనికి సుదర్శన్ మంత్రాలు వేయడమే కారణమని భూదేవి, ఆమె ముగ్గురు కుమారులు చంద్రశేఖర్, సాయికుమార్, భాస్కర్ అనుమానించారు.
ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి..
శనివారం రుచితతో సహా వారంతా సుదర్శన్ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తిరిగొచ్చి రుచిత అనారోగ్యానికి నువ్వే కారణమంటూ సుదర్శన్, ఆయన భార్య బాలమణి, కుమారుడు హరికృష్ణలపై దాడి చేశారు. అదే సమయంలో గ్రామానికి చెందిన మరికొంతమంది వచ్చి తమ కుటుంబ సభ్యుల అనారోగ్యానికీ సుదర్శనే కారణమంటూ దాడి చేశారు. ఇంటి ఆవరణలో నిలిచి ఉంచిన హరికృష్ణ ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ (Petrol) తీసి ఇంట్లోని కాగితాలు, కొన్ని వస్తువులు తీసుకొచ్చి నిప్పటించారు. సుదర్శన్ పై కూడా పెట్రోలు పోసి మంటల్లోకి తోసేయగా, తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఊరుకోకుండా ఆయన్ను సజీవ దహనం చేసేందుకు కట్టెలు సిద్ధం చేశారు.
అదే సమయంలో గ్రామానికి వచ్చిన పోలీసులు జనం గుమిగూడి ఉండటాన్ని గమనించి, సుదర్శన్‌ను కాపాడి గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన భూదేవి, చంద్రశేఖర్, సాయికుమార్ భాస్కర్, చిట్టి పోచయ్య, తుమ్మల నర్సింలు, సంగెపు శ్రీనులపై కేసు నమోదు చేశారు. గత రెండు నెలల క్రితం అల్గాదుర్గం మండల కేంద్రంలో భార్యాభర్తలిద్దరికీ ఒకే స్తంభానికి కట్టి దాడి చేసిన మరువక ముందే ఇలాంటి ఘటన మరోచోట జరగడం గమనార్హం. అనాది కాలం నుండి ఆచారాలు వస్తున్నాయని చాలామంది ఇప్పటికి కూడా ఎక్కువగా చేతబడి చేసే వారిని నమ్ముతూ కాలం వెళ్లదీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Medak, Murder attempt