THE SHOCKING REVELATION OF THE SON IN THE INCIDENT WHERE AN ELDERLY COUPLE WAS BRUTALLY KILLED INSIDE THE HOUSE IN PUTHUPPARYARAM SSR
Shocking Incident: వామ్మో.. నువ్వేం కొడుకువిరా నాయనా.. ఆ టైంలో యాపిల్ తిన్నావా..
పోలీసుల అదుపులో నిందితుడు సనల్
పుత్రుడు 'పున్నామ నరకం' నుంచి తప్పిస్తాడు అని పెద్దలు అంటుంటారు. కానీ.. అదే కొడుకు తన కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు.. ఇద్దరినీ చంపేశాక యాపిల్ తింటూ తల్లి శరీరంలోకి క్రిమి సంహారక మందును ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు.
పాలక్కడ్: పుత్రుడు 'పున్నామ నరకం' నుంచి తప్పిస్తాడు అని పెద్దలు అంటుంటారు. కానీ.. అదే కొడుకు తన కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు.. ఇద్దరినీ చంపేశాక యాపిల్ తింటూ తల్లి శరీరంలోకి క్రిమి సంహారక మందును ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోనిపాలక్కడ్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్కడ్‌లోని పుదుప్పారియారం ప్రాంతంలోని ఒట్టురుకావు ప్రాంతంలోని నివాసం ఉండే చంద్రన్ (64), ఆయన భార్య దేవి (54) సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం ఎంతసేపవుతున్నా ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి డోర్ బద్ధలు కొట్టి చూసేసరికి ఇంట్లో చంద్రన్, దేవి చెరో దగ్గర రక్తపు మడుగులో కనిపించారు. వంట గది దగ్గరలో దేవి, బెడ్రూంలో చంద్రన్ విగత జీవులుగా కనిపించారు. ఈ కేసులో వాళ్ల కొడుకు సనల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు అతనే చేశాడన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఈ సైకో సన్ జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. అది విని ఖాకీలు విస్తుపోయారు.
నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లోకి వెళ్లిన తను తొలుత ఫ్రంట్ డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత తల్లి ఉన్న దగ్గరకు వెళ్లాడు. కొడుకును చూసిన ఆమె కాసిన్ని మంచినీళ్లు తీసుకురమ్మని అడిగింది. అయితే.. ఈ క్రమంలో ఆమెతో గొడవ పడిన ఈ సైకో కొడుకు పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి కన్న తల్లిని అత్యంత పాశవికంగా పొడిచి చంపాడు. ఆమెను పలుమార్లు పొడుస్తూ పైశాచిక ఆనందం పొందాడు. అంతటితో ఆగలేదు. చంద్రన్ పడుకున్న రూంకు వెళ్లాడు. కన్న తండ్రిని కూడా దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలపై క్రిమి సంహారక మందు పోశాడు.
ఇలా ఎందుకు చేశావని పోలీసులు అడగ్గా.. రక్తాన్ని ఇంకిపోయేందుకు ఇది సహాయపడుతుందని చెప్పాడు. తల్లి చనిపోలేదని భావించిన సనల్ ఆమె శరీరంలోకి ఆ క్రిమిసంహారక మందును ఇంజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. అయితే.. ఆ సమయంలో తల్లి రక్తపు మడుగులో సనల్ జారిపడటంతో అతని చేతిలో ఉన్న ఇంజెక్షన్ సిరంజీ విరిగిపోయింది. దీంతో.. ఆ ప్రయత్నాన్ని విరమించున్నాడు. ఈ సైకో కొడుకు బయటపెట్టిన మరో విషయం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.
హత్య చేసిన సందర్భంలో సనల్ ధరించిన టీ-షర్ట్‌పై ‘Normal Is Boring’ అని రాసి ఉంది. రక్తపు మరకలతో కూడిన ఆ టీ షర్ట్‌ను పోలీసులు వచ్చేలోపు నిందితుడు దాచేశాడు. ఆధారాల కోసం వెతుకుతుండగా ఈ టీ-షర్ట్ బయటపడింది. పోలీసులకు సనల్ మానసిక స్థితి పూర్తిగా అర్థమైపోయింది. సనల్ పోలీసు విచారణలో మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు. తల్లిదండ్రులను చంపేశాక యాపిల్ తింటూ వాళ్ల శవాల దగ్గరకు వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత స్నానం చేసి పడుకుని ఉదయాన్నే సరదగా బయటకు వెళ్లి వచ్చానని చెప్పాడు. ఆ తర్వాత బెంగళూరుకు నిందితుడు పారిపోయాడు. ఈ కేసులో సనల్పై పోలీసులకు అనుమానం రావడంతో అతనిని తిరిగి ఇంటికి రప్పించేందుకు పోలీసులు అతని బ్రదర్ సునీల్‌తో ఫోన్ చేయించారు.
సనల్కు ఫోన్ చేసిన సునీల్.. గుర్తుతెలియని దుండగులు అమ్మానాన్నను చంపేశారని.. వాళ్ల అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద కొడుకుగా నువ్వు రావాలని సునీల్‌తో పోలీసులు చెప్పించారు. కేసు పూర్తిగా డైవర్ట్ అయిందని భావించిన సనల్ ఏమీ తెలియనట్టు ట్రైన్లో సొంతూరికి వచ్చాడు. పోలీసులు వెంటనే అతనిని అరెస్ట్ చేశారు. బీటెక్ చేసిన సనల్ ముంబైలోని ఓ జువెలరీ స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. కరోనా కారణంగా ఉద్యోగంలో కోల్పోయి 2020లో ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. డ్రగ్ అడిక్ట్‌గా మారి చివరకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.