Newly Married: ఘోరం.. తాను ఇష్టపడిన అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. పాపం పెళ్లయి రెండు నెలలే..

రాఘవన్, నిందితుడు ఆనంద్‌రాజ్

తమిళనాడులో ఘోరం జరిగింది. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి ఆ వివాహిత భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం జరిగిన ఈ ఘటన తూత్తుకుడిలో కలకలం రేపింది.

 • Share this:
  తిరువొత్తియూరు: తమిళనాడులో ఘోరం జరిగింది. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి ఆ వివాహిత భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం జరిగిన ఈ ఘటన తూత్తుకుడిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎట్టాయపురం సమీపంలోని కుమరగిరికి చెందిన సూర్య రాఘవన్ (31) అదే ప్రాంతంలో టీవీ రిపేర్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ షాపు యజమాని రాఘవన్ బంధువు కావడం గమనార్హం. రాఘవన్‌కు వివాహం కాలేదు.

  అయితే.. ఈ టీవీ సర్వీస్ సెంటర్‌కు దగ్గర్లో ఓ టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో టైప్ రైటింగ్ నేర్చుకునేందుకు మహాలక్ష్మి (21) అనే యువతి రోజూ వస్తూపోతూ ఉండేది. ఆమెతో రాఘవన్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. కొన్నాళ్లకు ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్న విషయం ఇరు కుటుంబాలకు చెప్పారు. అయితే.. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. ఇలా గొడవలు జరుగుతుండగా.. మహాలక్ష్మి కులానికే చెందిన ఆనంద్‌రాజ్ అనే మరో యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని మహాలక్ష్మితో చెప్పాడు.

  రాఘవన్‌తో అప్పటికే ప్రేమలో ఉన్న మహాలక్ష్మి ఆనంద్‌రాజ్‌కు తాను పెళ్లంటూ చేసుకుంటే అది రాఘవన్‌నే అని తెగేసి చెప్పింది. ఈ పరిణామం రాఘవన్‌పై ఆనంద్‌రాజ్‌ కక్ష పెంచుకునేలా చేసింది. రాఘవన్, మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడం ఖాయమని ఆనంద్‌రాజ్ భావించాడు. అనుకున్నట్టుగానే.. పెద్దలను కాదనుకుని రాఘవన్, మహాలక్ష్మి రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎప్పటిలానే రాఘవన్ అదే టీవీ రిపేర్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ మహాలక్ష్మితో కలిసి ఓ అద్దె ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ద్వేషం ఆనంద్‌రాజ్‌లో రోజురోజుకూ పెరిగిపోయింది. రాఘవన్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. నేరుగా వెళ్లి చంపకుండా.. తన ఎల్‌ఈడీ టీవీ రిపేర్‌కు వచ్చిందని వారం క్రితం రాఘవన్ షాపుకు ఆనంద్‌రాజ్ వెళ్లాడు. ఆనంద్‌రాజ్ ఎవరో కూడా తెలియని రాఘవన్ టీవీ తీసుకురమ్మని చెప్పాడు.

  ఇది కూడా చదవండి: Wife: మూడో పెళ్లి చేసుకున్న భర్తకు, ఈమెకూ 16 ఏళ్ల ఏజ్ గ్యాప్.. భర్తతో ఇలా కనిపించినా.. చివరికి..

  టీవీని రిపేర్ చేసిన రాఘవన్ తీసుకెళ్లాల్సిందిగా బుధవారం ఆనంద్‌రాజ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆనంద్‌రాజ్ రాఘవన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు. తన వెంట తీసుకెళ్లిన ఓ బ్యాగ్‌లో నుంచి కారప్పొడి తీసి రాఘవన్ కళ్లలో కొట్టాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యమంటూ అతనితో గొడవకు దిగాడు. ఆ తర్వాత అదే బ్యాగ్‌లో నుంచి కత్తి తీసి రాఘవన్ తల నరికాడు. ఆ తలను రోడ్డుపై విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ట్యూటికోరిన్ జిల్లా ఎస్పీ ఎస్ జయకుమార్ వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఓ టీంను ఏర్పాటు చేసి ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఆనంద్‌రాజ్‌ను అరెస్ట్ చేశారు. రాఘవన్ మృతదేహాన్ని తూత్తుకుడి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పెళ్లయిన రెండు నెలలకే మహాలక్ష్మి తాను ఎంతగానో ప్రేమించిన భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.
  Published by:Sambasiva Reddy
  First published: