THE MOTHER HAD GONE TO FETCH COLD WATER WHILE BATHING UNAWARE OF THIS THE CHILD POURED HOT WATER SSR
Mother: రెండేళ్ల కూతురు.. నవ్వుతూ ఇంట్లో సందడి చేసేది.. తల్లి వేడి నీళ్లు బాత్రూంలో ఉంచి చన్నీళ్లు తెచ్చేలోపు..
ఆద్య (ఫైల్ ఫొటో)
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వేడి నీళ్లు శరీరంపై పడటంతో తీవ్రంగా ఒళ్లు కాలిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది.
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వేడి నీళ్లు శరీరంపై పడటంతో తీవ్రంగా ఒళ్లు కాలిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని దాసనకొప్పలు అనే గ్రామంలో రాము అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్లైంది. రెండేళ్ల వయసున్న పాప కూడా ఉంది. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ రాము భార్యాపాపతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ కావడంతో రాము ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. అందువల్ల తల్లే పాపను కంటికి రెప్పలా చూసుకునేది. ఆమె ఇంటి వద్దే ఉంటూ పాప ఆలనాపాలనా చూసుకునేది. ఇంటి పని చేసుకుంటూ పాపను చూసుకోవడమే ఆ తల్లికి ప్రపంచంగా మారింది. పాపకు ఇటీవలే రెండో సంవత్సరం బర్త్‌డే కూడా ఘనంగా చేశారు.
ఇదిలా ఉంటే.. రోజూలానే రెండేళ్ల కూతురు ఆద్యకు స్నానం చేయించేందుకు సిద్ధమైంది. చలికాలం కావడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తే పాప చలికి తట్టుకోలేదని భావించి వేడినీళ్లు కాచింది. ఆ వేడినీళ్లను బాత్రూమ్లో పెట్టి చన్నీళ్లు తీసుకొచ్చేందుకు తల్లి అలా వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోనే ఆడుకుంటున్న పాప అవి వేడి నీళ్లని, ముట్టుకుంటే కాలుతుందని తెలియక బకెట్లో చేయి పెట్టింది. కాలడంతో బాధ తట్టుకోలేక చేయి తీసే క్రమంలో బకెట్ ప్రమాదవశాత్తూ పాపపై పడింది. దీంతో.. ఆ బకెట్లో ఉన్న సలసల మరిగే వేడి నీళ్లు పాప శరీరంపై ఒలికాయి.
పాప ఆ బాధను తట్టుకోలేక పెద్దగా ఏడుస్తూ ఉండటంతో ఏమైందా అని తల్లి చన్నీళ్లు తీసుకుని వచ్చి చూసింది. అప్పటికే చిన్న పాప కావడం, మృదువైన శరీరం కావడంతో కాలిన గాయాలతో పాప విలపించడాన్ని చూసి కన్న తల్లి గట్టిగా కేకలేసింది. దీంతో.. ఇరుగుపొరుగు వారు వచ్చి చూశారు. ఆ పాప తల్లి కుప్పకూలిపోవడంతో ఆ పాపను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. అయితే.. చిన్న పాప కావడంతో ఆ బాధ తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తూనే ఉంది. మైసూరులోని కేఆర్ హాస్పిటల్‌కు పాపను చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. అప్పటికే పాప శరీరం బాగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది.
ఊహించని ఈ ఘటన రాము, అతని భార్య జయలక్ష్మి జీవితంలో పెను విషాదాన్ని నింపింది. అయితే.. ఈ ఘటనలో ఇరుగుపొరుగు వారు పాప తల్లి జయలక్ష్మిని తప్పుబట్టారు. పాప అక్కడే ఆడుకుంటూ ఉందని గమనించకుండా వేడి నీళ్ల బకెట్‌ను బాత్రూంలో పెట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లలను ఓ కంట కనిపెట్టకపోతే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని, పిల్లలను అను క్షణం కన్న తల్లి కనిపెట్టుకుని ఉండాలని చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇంట్లో నవ్వుతూ ఆడిపాడుతూ సందడి చేసే రెండేళ్ల కూతురు ఆద్య ఇక లేదనే విషయాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. పాప చనిపోయిన సంగతి తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.