కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ జంటకు పోలీసులు స్టేషన్లోనే పెళ్లి చేశారు. అందులో వింతేముందని ఆశ్చర్యపోకండి. వరుడి వయసు 38. వధువు వయసు 41 సంవత్సరాలు కావడం గమనార్హం. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. లెక్చరర్లుగా పనిచేస్తున్న ఆ ఇద్దరి పెళ్లి ఊహించని రీతిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాకు చెందిన ప్రేమ(41) అనే మహిళ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమెకు నా అనే వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ గవాస్కర్(38) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ ఇద్దరూ ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల గవాస్కర్‌ను ప్రేమ కోరింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని.. గవర్నమెంట్ జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటానని గవాస్కర్ ఆమెకు చెప్పాడు. ఈ మధ్య గవాస్కర్ తనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని ప్రేమ ఒత్తిడి చేసింది. అప్పుడు అయ్యగారు అసలు కారణాన్ని బయటపెట్టారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పకుండా తనకంటే రెండుమూడేళ్లు వయసులో నువ్వు పెద్ద అని, అందుకే పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని గవాస్కర్ చెప్పాడు. దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని గవాస్కర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గవాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పెళ్లి చేసుకోకపోతే ఆమెను మోసం చేసిన కేసులో ఊచలు లెక్కించాల్సి ఉంటుందని పోలీసులు గవాస్కర్‌కు తేల్చి చెప్పారు. దీంతో.. ఆమెను మోసం చేయాలని భావించిన గవాస్కర్ చివరకు మనసు మార్చుకుని ప్రేమను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. దీంతో.. మహిళా పోలీసులే దగ్గరుండి వారి పెళ్లి చేశారు. స్టేషన్‌కు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వారిని తీసుకెళ్లి అతనితో ఆమె మెడలో పసుపు తాడు కట్టించారు. ఇలా 41 ఏళ్ల వయసున్న ప్రేమకు, 38 ఏళ్ల వయసున్న గవాస్కర్‌కు వివాహం జరిగింది. వీరి పెళ్లి కడలూరు జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేరాఫ్ కంచరపాలెం సినిమాను తలపించిన ఈ జంట పెళ్లికి పోలీసులతో పాటు ఇద్దరి బంధుమిత్రులు హాజరు కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Marriage, Tamilnadu