భారతదేశం (India) ఎన్నో రంగాల్లో అభివృద్ధి ( Development) చెందుతున్నా మూఢనమ్మకాలు.. కుల పిచ్చి లాంటివి ఇప్పటికీ పోలేదు. ఇంకా ఏదో ఒక చోట పరువు హత్యలు(Murder) జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి(Marriage) చేసుకునేందుకు కులం(Caste) అడ్డు వస్తూనే ఉంది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి తండ్రి ఆమెకు గుండు గీయించి పుణ్య స్నానం చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని బేతుల్(Bethul) జిల్లాలోని చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్ అనే యువతి హాస్టల్ లో ఉంటూ నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఆ కాలేజీలోనే నర్సింగ్ చదువున్న అమిత్ అహిర్వాల్ అనే దళిత యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా కొన్నాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పేందుకు ధైర్యం చేయలేదు. కులం పట్టింపులు ఉండటంతో యువతి వాళ్ల తల్లిదండ్రులకు, యువకుడి కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు.
దీంతో గతేడాది మార్చి నెలలో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఇలా ఆమె ఇంట్లో పెళ్లి విషయం చెప్పకుండా సీక్రెట్ గా దాచి పెట్టింది. అక్కడే ఓ రూంలో ఉంటూ ఇద్దరు కాపురం చేశారు. చివరకు ఈ సంవత్సరం జనవరిలో ఆ యువతి తన తండ్రికి చెప్పింది. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు. అంతే కాకుండా ఆగ్రహంతో తన కూతురు తప్పిపోయినట్లు కూడా పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను తన కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ యువతి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురిచేయనని వాళ్లు పోలీసుల దగ్గర చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆమె నర్సింగ్ పూర్తి చేయడానికి ఫిబ్రవరిలో మళ్లీ హాస్టల్‌కు వెళ్లింది. అమ్మాయితో కలిసి ఉన్నట్లు.. ఆ వివాహాన్ని ఒప్పుకున్నట్లు తండ్రి పూర్తిగా నమ్మించాడు.
ఈ సంవత్సరం ఆగస్టులో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమెను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తన కూతురును హోషంగాబాద్‌లోని నర్మదా నది వద్దకు తీసుకువెళ్లి ఆమెకు గుండు చేయించాడు. తర్వాత అక్కడే ఆమెతో బలవంతంగా పుణ్య స్నానం కూడా చేయించాడు. దళిత యువకుడితో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశానని చెప్పాడు. అంతే కాకుండా భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా ఆమెపై కుటుంబసభ్యులు బలవంతం చేశారు.
ఇలా వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఇంటి నుంచి తప్పించుకొని.. తన భర్త దగ్గరకు చేరుకుంది. జరిగిన విషయం అంతా చెప్పి.. ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhyapradesh, Marriage