చెన్నై: భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ ఆ గొడవలు ముదిరితే అనర్థాలు తప్పవు. తమిళనాడులోని ఓ జంట విషయంలో అదే జరిగింది. చెన్నైలోని తాండయార్‌పేట్‌కు చెందిన హరి అనే 27 ఏళ్ల యువకుడు ఓ కార్ల షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు జీవిత. అయితే.. ఇటీవల హరి తన భార్య చావుబతుకుల మధ్య ఉందని హుటాహుటిన ఆమెను చెన్నైలోని స్టాన్లీ హాస్పిటల్‌కు తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న జీవిత
కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. జీవిత మృతిపై తమకు అనుమానాలున్నాయని, పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో.. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు.
తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని హరి పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు. అయితే.. ఇతగాడు చెప్పిన కారణంలో నిజం లేదని పోస్ట్‌మార్టం నివేదికతో తేలిపోయింది. జీవితను తీవ్రంగా కొట్టి గాయపరిచి, ఆమె ఛాతిపై తన్నడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని పోస్ట్‌మార్టంలో తేలింది. హరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమెను తానే కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్య కేసు తన మీదకు రాకూడదని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు హరి తెలిపాడు.
హరి, జీవితకు వివాహం జరిగి రెండేళ్లయింది. ఈ జంటకు పిల్లలు లేరు. భార్యాభర్తలు చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. సాఫీగా సాగిపోవాల్సిన సంసారం కలహాల కాపురంగా మారింది. భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మరింత పెరగడంతో జీవిత తండ్రి మహేంద్రన్ కూతురి ఇంటికి వచ్చి ఉంటున్నాడు. నెల రోజులుగా వీళ్లతోనే ఉంటున్నాడు. తాను ఉంటేనయినా కూతురు, అల్లుడు గొడవలు పడటం మానుకుంటారని భావించిన జీవిత తండ్రికి నిరాశే ఎదురైంది.
కొన్ని రోజులు బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్లీ గతంలో మాదిరిగానే జీవిత, హరి గొడవ పడుతుండటంతో ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన మహేంద్రన్ కూతురి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం హరేనని భర్తతో జీవిత గొడవ పెట్టుకుంది. హరి, జీవిత మధ్య గొడవలు ఘర్షణకు దారితీశాయి. ఈ క్రమంలోనే జీవితపై హరి భౌతిక దాడికి దిగాడు. జీవితను ఛాతిపై తన్నడంతో బలంగా దెబ్బ తగిలింది. స్పాట్‌లోనే ఆమె కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. భార్యను క్షణికావేశంలో హత్య చేసిన హరి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అతని నిజాన్ని బట్టబయలు చేశారు. హరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Husband, Wife, Wife murdered