విరుధునగర్: భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు సహజం. ఆ గొడవలు అలకలు, బుజ్జగింపులతో ముగిస్తే పర్వాలేదు కానీ ముదిరి పాకాన పడితేనే ఇబ్బందులు మొదలవుతాయి. ఆ మనస్పర్థల మాటున ఏ ఒక్కరిలో అయినా అనుమానం మొదలయితే ఆ కాపురంలో కలతలు ఏ దరికి చేరుస్తాయో ఊహించలేం. తమిళనాడులోని విరుధునగర్లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. భర్త అనుమానం భార్య నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్లోని ఎన్జీవో కాలనీకి చెందిన కణ్ణన్ 11 ఏళ్ల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం. ఆ యువతి కూడా రూపవతి. చూడటానికి లక్షణంగా ఉంది. దీంతో.. పెళ్లైన కొన్నాళ్లు తనకు అందమైన యువతి భార్యగా వచ్చిందని కణ్ణన్ ఆమెను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. కానీ.. ఆమె అందమే అతని బుద్ధిని పెడతోవ పట్టిస్తుందని అతని భార్య కలలో కూడా ఊహించలేదు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
భార్య తనతో కాకుండా ఏ మగాడితో మాట్లాడినా ఆమెను కణ్ణన్ అనుమానించేవాడు. ‘ఏం మాట్లాడావ్, ఎందుకు మాట్లాడావ్’ అంటూ ఆమెను వేధించేవాడు. సూటిపోటి మాటలతో బాధపెట్టేవాడు. కూరగాయలు అమ్ముకునేవాడితో మాట్లాడినా, పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తితో మాట్లాడినా ఇలా ఎవరితో మాట్లాడినా ఆమెను అనుమానంతో వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ భర్త అనుమానం అంతటితో ఆగలేదు.
ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడికి తన పోలికలు రాలేదని, ఆ పిల్లాడి కాళ్లూచేతులూ తనలా లేవని.. ఎవరితో ఏ తప్పు చేశావని భార్యను దారుణంగా అనుమానించేవాడు. భార్య అందంగా ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్న కణ్ణన్ ఆమె తనకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించిందని బలంగా నమ్మేవాడు. ఆ అనుమానంతో నిత్యం వేధించేవాడు. జనవరి 10న ఉదయం భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎవరితో తప్పు చేసి ఆ పిల్లాడిని కన్నావంటూ భార్యను అనరాని మాటలన్నాడు.
భర్త అనుమానంతో విసిగిపోయిన ఆమె తాను ఏ తప్పూ చేయలేదని, అలా మాట్లాడటానికి మనసెలా వచ్చిందంటూ ఏడుస్తూ భర్తకు బదులిచ్చింది. ఇలా ఈ గొడవ ఇంతటితో ముగియలేదు. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకునేంత వరకూ వ్యవహారం వెళ్లింది. గొడవ చిలికిచిలికి గాలివానగా మారడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. క్షణికావేశంలో కణ్ణన్ భార్యను కత్తితో పొడిచాడు. ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఇరుగుపొరుగు వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలు అప్పటికే గాలిలో కలిసిపోయాయి. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సదరు వివాహిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కణ్ణన్పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. భార్యా, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం భర్త అనుమానంతో ఛిన్నాభిన్నమైంది. విరుధునగర్ రూరల్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.