THE ANAMALAI POLICE HAVE REGISTERED A CASE AGAINST SEVEN PERSONS ON CHARGES OF ASSAULTING AN 18 YEAR OLD DALIT YOUTH SSR
Lovers: పనిమనిషిగా పనిచేస్తున్న యువతితో లవ్.. ఆమె పనిచేసే ఇంటికి రాత్రి 11 గంటలకు గోడ దూకి వెళ్లగా..
ప్రతీకాత్మక చిత్రం
18 ఏళ్ల వయసున్న దళిత యువకుడిని కట్టేసి విచక్షణారహితంగా కొట్టిన ఘటన తమిళనాడులో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నామలైకి చెందిన రామస్వామి అనే వ్యక్తి భూస్వామి.
కోయంబత్తూర్:తమిళనాడులో (Tamilnadu) దళితులపై అక్కడి అగ్రవర్ణాల అమానుషాల గురించి గతంలో పలు చిత్రాలు కూడా తెరకెక్కాయి. ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. ఎన్ని సినిమాలు వచ్చినా, కుల రహిత సమాజం కోసం ఎవరూ ఎంతగా ఎదురుచూసినా పరిస్థితులు మారేలా కనిపించడం లేదు. తాజాగా తమిళనాడులోని అన్నామలై (Anamalai) పరిధిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. 18 ఏళ్ల వయసున్న దళిత యువకుడిని (Dalit Youth) కట్టేసి విచక్షణారహితంగా కొట్టిన ఘటన తమిళనాడులో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నామలైకి చెందిన రామస్వామి అనే వ్యక్తి భూస్వామి. దళిత సామాజిక వర్గానికి చెందిన హరిహర సుధాకర్ అనే యువకుడు రామస్వామి పొలాల్లో పనులకు వెళుతుండేవాడు.
రామస్వామి ఇంట్లో 19 ఏళ్ల వయసున్న ఓ దళితయేతర యువతి పనిమనిషిగా పనిచేస్తుండేది. ఈ యువతితో హరిహర సుధాకర్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఎవరికీ తెలియకుండా కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ యువతి స్వస్థలం మధురై. సుధాకర్ స్వస్థలం అన్నామలైలోని మక్కల్ శక్తి నగర్. సుధాకర్, ఈ యువతి ప్రేమలో ఉన్నారన్న సంగతి భూస్వామి అయిన రామస్వామికి తెలిసింది. దీంతో.. కొన్ని నెలల క్రితం తన పొలంలో పనులకు రావొద్దని, సుధాకర్‌ను పనిలో నుంచి తీసేశాడు. అయితే.. ఆ తర్వాత కూడా ఫోన్లో సుధాకర్, ఆ యువతి టచ్‌లో ఉండేవారు. ఈ విషయం రామస్వామి భార్యకు తెలిసింది. ఆ యువతితో దూరంగా ఉండమని అతనికి చెప్పాలని రామస్వామి భార్య సుధాకర్ పిన్నికి చెప్పి హెచ్చరించింది.
ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ గత గురువారం రాత్రి 9 గంటల సమయంలో తాగేసి రామస్వామి ఇంటికి నేరుగా వెళ్లాడు. ఆ యువతితో తనతో పాటు పంపించాలని అడిగాడు. రామస్వామి కుదరదని తెగేసి చెప్పి సుధాకర్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. రాత్రి 11 గంటల సమయంలో రామస్వామి ఇంటికి సుధాకర్ మళ్లీ వెళ్లాడు. ఈసారి గేట్లు మూసివేయడంతో గోడ దూకి మరీ ఇంట్లోకి వెళ్లాడు. ఆమెతో మాట్లాడేందుకు అనుమతించాలని రామస్వామిని అడిగాడు.
ఈ పరిణామంతో కోపంతో ఊగిపోయిన రామస్వామి మరో ఆరుగురు కలిసి సుధాకర్ అనే ఆ దళిత యువకుడిని కొబ్బరితోటకు తీసుకెళ్లారు. చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్టు బాదారు. ఆ మరుసటి రోజు సుధాకర్‌ను విడిచిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్పి గొడవ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి పంపించారు. వాళ్లు కొట్టిన దెబ్బల కారణంగా తీవ్రంగా గాయపడిన సుధాకర్ వెట్టైకరంపుదుర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రామస్వామితో పాటు అతనికి దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదుతో ఈ దాడికి పాల్పడిన రామస్వామి, కేశవన్, కలిముత్తు, రామన్, రసతి అనే వ్యక్తులతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో తమిళనాడులో మరోసారి దళిత, అగ్రవర్ణాల అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.