కలహంది: ఒడిశాలో నిత్య పెళ్లి కూతురి బాగోతం బట్టబయలైంది. ఫేక్ ఆధార్ కార్డులతో, ఫేక్ పేర్లతో ముగ్గురు యువకులను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వారితో కొన్నాళ్లకు గొడవ పడి డబ్బు డిమాండ్ చేయడమే పనిగా పెట్టుకున్న ఆ 32 ఏళ్ల మహిళ డ్రామాలకు పోలీసులు చెక్ పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలీ మహంత అనే 32 ఏళ్ల మహిళ ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించుకుని, ఒక్కో ఆధార్‌లో ఒక్కోలా తన పేరు, చిరునామాను మార్చుకుంది. తొలుత.. కుముదబంధు పటేల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను చనిపోవడంతో, 2013లో రాజేంద్ర దాస్‌ను పెళ్లి చేసుకుంది. రాజేంద్ర దాస్‌తో విడిపోయిన తర్వాత ఎలీ ఛత్తీస్‌గర్‌లోని బంధువుల ఊరైన సరన్‌గర్‌లో ఉంటోంది.
గత సంవత్సరం జూన్‌లో.. బీర్బల్ శర్మ అనే ఒక మధ్యవర్తి బికాస్ జైన్ అనే ఒక వ్యక్తికి పెళ్లి సంబంధం చూశాడు. అయితే.. 4 లక్షల ఎదురు కట్నమివ్వాలని చెప్పాడు. అప్పటికే కొడుకుకు పెళ్లి సంబంధాలు చూసి ఎక్కడా కుదరక పోవడంతో విసిగివేసారిన బికాస్ కుటుంబం ఎదురు కట్నమిచ్చి మరీ కొడుకు పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. ఆ మధ్యవర్తి తీసుకొచ్చిన సంబంధం, జైన్ కుటుంబానికి చూపించిన ఫొటో మరెవరిదో కాదు.. ఆ ఫొటోలో ఉన్న యువతి ఎలీనే కావడం గమనార్హం.
ఫేక్ తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకుని బికాస్ జైన్‌ను ఎలీ జూన్ 28, 2020న పెళ్లి చేసుకుంది. తనను తాను మమత అగర్వాల్‌గా ఆ కుటుంబానికి పరిచయం చేసుకున్న ఎలీ పెళ్లి తర్వాత కొంత భిన్నమైన ప్రవర్తనతో ఉండటం బికాస్ గమనించాడు. ఆమెపై అనుమానంతో ఆరా తీయగా.. ఆమె గదిలో రకరకాల ఆధార్ కార్డులు బికాస్‌కు దొరికాయి. అంతేకాదు.. 30 వేల డబ్బు కూడా ఆమె దొంగిలించినట్లు తేలింది. ఇదంతా ఏంటని నిలదీయగా.. విడిపోవడానికి ఎలీ 5 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో.. జైన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఎలీ బాగోతం బయటపడింది. మదన్‌పూర్ రామ్‌పూర్ పోలీసులు విచారించగా.. బికాస్‌తో పెళ్లైన విషయాన్ని దాచి ఎలీ మరో పెళ్లికి సిద్ధమైనట్లు విచారణలో తేలింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Odisha