హోమ్ /వార్తలు /క్రైమ్ /

Maoist Attack: మన్యంలో మారణ హోమం.. పోలీసులు, మావోలకు యుద్ధం.. మధ్యలో జనం

Maoist Attack: మన్యంలో మారణ హోమం.. పోలీసులు, మావోలకు యుద్ధం.. మధ్యలో జనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maoist Attack: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా గ్రామాల్లో పర్యటించొద్దని నేతలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలైన తెరాస, బీజేపీలకు చెందిన మండల, గ్రామ స్థాయుల్లోని నాయకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...

శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్18 

సరిగ్గా వారం రోజుల క్రితం.. వెంకటాపురం మండల కేంద్రంలో పోలీస్ బాస్‌ల సమావేశం.. కేంద్ర హోంశాఖ సీనియర్‌ సలహాదారు, తీవ్రవాద నిర్మూలనలో తలపండిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం.. మావోయిస్టుల నిర్మూలనకు పాటించాల్సిన వ్యూహం, ఎత్తుగడలపై సుధీర్ఘంగా సమీక్షించిన అధికారులు ఆమేరకు బాధ్యులకు తగిన సూచనలు చేసిన ప్రాంతం.. వారం తిరగకుండానే పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడన్న నెపంతో అదే మండలం ఆలుబాకకు చెందిన మడూరి భీమేశ్వరరావును అతడి ఇంట్లోనే కుటుంబ సభ్యులు చూస్తుండగానే మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.  వారు వదలివెళ్లిన లేఖలో 'పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నందునే భీమేశ్వరరావును చంపామని.. వాజేడు-వెంకటాపురం ఏరియాకమిటీ కార్యదర్శి వికల్ప్‌ పేరిట పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీలకు వత్తాసు పలుకుతూ పేదలను పీల్చిపిప్పి చేస్తున్నవారికి ఇదే గతి పడుతుందని లేఖలో హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా గ్రామాల్లో పర్యటించొద్దని నేతలకు సూచించారు. ముఖ్యంగా అధికార పార్టీలైన తెరాస, బీజేపీలకు చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులను తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

గత కొద్ది నెలలుగా తెలంగాణలో తమ పూర్వపు పట్టును పెంచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని విస్తరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటికే ఎనిమిది మందిని కోల్పోవడంతో కేవలం తమ బలాన్ని చాటుకోవడం, క్యాడర్‌లో స్థైర్యాన్ని నింపడం కోసమే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు, శరీర ఉష్ణోగ్రత సాయంతో ఉనికిని కనిపెట్టడం లాంటి టెక్నాలజీ సాయంతో మావోయిస్టుల ప్రతి కదలికను పసిగట్టి వారిని ఎక్కడికక్కడ నిరోధిస్తూ, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్న పోలీసులకు తాజాగా ఈ ఘటన సవాలుగా మారింది. మావోయిస్టు ప్రభావిత సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఒడిషా, ఆంధ్రాలలో కొన్ని వేల గ్రామాల్లోని నాయకులను ఇక నుంచి మావోయిస్టులు టార్గెట్‌ చేసే ప్రమాదం ఉంది. అన్నిచోట్ల పోలీసులు క్షేత్ర స్థాయిలో భద్రత కల్పించడం సాధ్యమయ్యే పనికాదు. దీంతో జాగ్రత్తగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట మావోయిస్టులు, మావోయిస్టు కొరియర్ల పేరిట పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఎవరి నిఘాను వారు పెంచుకుంటున్నారు. ఇది ఆ ప్రాంత వాసులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. ఎవరికి సహకరించకపోయినా ఇబ్బందే. అలాగని నోరు తెరిస్తే ఎవరికో ఒకరికి టార్గెట్‌ కాకతప్పదు. దీంతో ఆ ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే పోలీసు ఇన్‌ఫార్మర్ల ముద్ర వేసి బీజపూర్‌ జిల్లాలోని గంగలూర్‌లో ప్రజాకోర్టు నిర్వహించి 25 మందిని చంపేసిన విషయాన్ని మావోయిస్టులే లేఖలో వెల్లడించారు. దీంతో ఏజెన్సీలో ఏ క్షణం ఎలాగుంటుందోనన్న బెంగతో జనం భయంభయంగా కాలం గడుపుతున్నారు. గత వారంలో ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే బీఎస్‌ఎఫ్‌ దళాలను మావోయిస్టుల వేట కోసం దింపాలన్న సూచనప్రాయ నిర్ణయం కూడా మావోయిస్టులు ఈ విధంగా రెచ్చిపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అధికార తెరాస పార్టీకి చెందిన వ్యక్తిని టార్గెట్‌ చేసి చంపేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీంతో ఏ స్థాయి పోలీసు అధికారులు వచ్చినా, ఎంతటి బలమైన దళాలను దింపినా, తమ వివరాలు చెప్పేందుకు వణికిపోయేలా తమకు అనుకూల వాతావరణాన్ని కల్పించే పనిలో భాగంగానే ఇలా తెగబడి ఉంటారని నక్సల్స్‌ ఆపరేషన్లలో అనుభవం ఉన్న ఓ పోలీసు అధికారి తెలిపారు. వాస్తవానికి ఇలాంటి హత్యలకు మావోయిస్టులు చాలా అరుదుగా పాల్పడుతుంటారు. గతేడాది జులై 12న నల్లూరి శ్రీనివాసరావు అనే ఎంపీటీసీని హత్య చేయడం కూడా ఇలాంటి ఘటనే. కేవలం తమ ఉనికిని చాటుకోవడం, తమకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తే ఎవరికైనా ఏగతి పడుతుందోనన్న సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా ఈ హత్య జరిగిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల ఆధిపత్యపోరాటంలో సామాన్యులు నష్టపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది.

First published:

Tags: Maoist attack, Telangana Police

ఉత్తమ కథలు