news18-telugu
Updated: September 28, 2020, 12:48 PM IST
ప్రతీకారాత్మక చిత్రం
పోలీసులు తమ వారిని కొట్టి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని వారు పట్టబడుతున్నారు. దీంతో పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పోలీసుస్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను బ్లూ కోట్స్ పోలీసులు తీసుకువెళ్లారు.
అయితే రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన గొల్లె సారయ్య అనే వ్యక్తి సార్ నా ఫోన్ ఇవ్వండి అంటూ బైక్ పై పోలీసులను వెంబడించాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సారయ్య కొద్ది దూరం తర్వాత విగత జీవిగా పడిపోయి ఉన్నాడు. అతనితో పాటు మద్యం తగిన ఇద్దరు వ్యక్తులు సారయ్య కోసం వెళ్లగా రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించాడు. దీంతో వారు విషయాన్ని బంధువులకు చెప్పారు. ఫోన్లు ఇవ్వాలని సారయ్య పోలీసులను అడగడంతో గొడవ జరిగిందని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. దీంతో పోలీసులు సారయ్య తలపై కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.
మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పోలీసులు సారయ్యను కొట్టి ఆక్సిడెంట్ అయిందని మాయమాటలు చెబుతున్నారన్నారు. రాత్రి పోలీసులు మృతుడి భార్యని పిలిపించి ఎవరికీ చెప్పవద్దు అని నీకు తగిన న్యాయం చేస్తామని పేపర్లపై సంతకాలు పెట్టించుకుని పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని కదిలించేది లేదన్నారు. మృతుడి కుటుంబీకుల ఆందోళనతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు బాధిత కుటుంబీకులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది.
Published by:
Nikhil Kumar S
First published:
September 28, 2020, 12:43 PM IST