కెలికితే కామెడీగా చంపేస్తారంటూ జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటది. వైఫైలాగా తలనిండా ఈగోతో, తరచూ గొడలుపడే చాలా మంది యవకులు డైలాగ్ ను అక్షరాలా నిజమని నిరూపిస్తుంటారు. కామారెడ్డి జిల్లా బిర్కూరుకు చెందిన సల్మాన్ కూడా అలాంటి యువకుడే..
(P.Mahender,News18,Nizamabad)
ఈ కాలంలో కుర్రోళ్లతో పెట్టుకోకు.. కెలికితే కామెడీగా చంపేస్తారంటూ జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటది. వైఫైలాగా తలనిండా ఈగోతో, తరచూ గొడలుపడే చాలా మంది యవకులు డైలాగ్ ను అక్షరాలా నిజమని నిరూపిస్తుంటారు. కామారెడ్డి జిల్లా బిర్కూరుకు చెందిన సల్మాన్ కూడా అలాంటి యువకుడే. చిన్న సంఘటన చిలికిచిలికి పెద్దదై, చివరికి కత్తులతో దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఊళ్లో ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనకు సంబంధించి బీర్కూరు పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
విద్యుత్ వాడకం విషయంలో ఇరుగుపొరుగు మధ్య తలెత్తిన గొడవ కత్తిపోట్లకు దారితీసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బిర్కూరు బ్యాంక్ ఉద్యోగి అయిన సజ్జాద్ ఇటీవలే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. అక్కడ జరుగుతోన్న పనులకు విద్యుత్ అవసరం కాగా, సజ్జాద్ అక్రమంగా విద్యుత్ స్తంభం నుంచి కరెంటు తీగలను వేసి వాడుకుంటున్నాడు. కొత్త ఇంటికి ఎదురుగా నివసిస్తోన్న సల్మాన్ ఈ వ్యవహారాన్ని గమనించి ట్రాన్స్ కో అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే లైన్ మెన్లు వచ్చి సజ్జాద్ అక్రమ కనెక్షన్ ను తొలగించారు. ఫిర్యాదు చేసింది సల్మానే అని తెలియడంతో సజ్జాద్ గొడవకు దిగాడు.
ఈక్రమంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతలోనే కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించి పంపేశారు. అయితే సల్మాన్ కు మాత్రం కోపం ఎంతకూ తగ్గలేదు. తనతో గొడవ పెట్టుకున్న సజ్జాద్ ను ఎలాగైనాసరే దెబ్బతీయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తన సోదరులు ఇద్దరిని, బాన్సువాడ నుంచి మరో ముగ్గురిని పిలిపించి శనివారం రాత్రి సజ్జాద్ పై దాడికి యత్నించాడు. ఇది తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకోవడంతో కొట్లాట మరింత పెద్దదైంది. సల్మాన్ తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
కత్తుల దాడిలో సజ్జాద్, ఫయాజ్, అస్లాం, సమీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈలోపే సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి గాయప్డవాళ్లను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కత్తులతో దాడికి పాల్పడిన సల్మాన్ వర్గాన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ బీర్కూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్తగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.