Home /News /crime /

TEN INJURED IN STABBING ATTACK ON COMMUTER TRAIN TOKYO SU

Shocking Incident: ఆడవాళ్లు సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు.. రైలులో బీభత్సం..

దాడి జరిగిన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

దాడి జరిగిన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ఓ వ్యక్తి రైలులో బీభత్సం సృష్టించాడు. సంతోషంగా కనిపించిన మహిళలే లక్ష్యంగా రెచ్చిపోయాడు

    ఓ వ్యక్తి రైలులో బీభత్సం సృష్టించాడు. సంతోషంగా కనిపించిన మహిళలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం 10 మందిని గాయపరిచాడు. ఈ షాకింగ్ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో చోటుచేసుకుంది. అతడు గాయపరిచినవారిలో.. ఓ యూనివర్సిటీ విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం టోక్యో నగరంలో జరుగుతున్న ఒలంపిక్స్ సంబంధం లేని యాదృచ్చిక ఘటనగా జపాన్ మీడియా దీనిని అభివర్ణించింది.

    శుక్రవారం రాత్రి 8.40 గంటల సమయంలో నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఓడక్యు లైన్‌లో 36 ఏళ్ల వ్యక్తి సడన్‌గా మహిళలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ట్రైన్ ఆపరేటర్ అత్యవసరంగా ట్రైన్‌‌ను నిలిపివేశారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. అందులో 9 మంది ఆచూకీని అధికారులు గుర్తించారు. వారిలో యూనిర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.

    ఇక, ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని యూసుకే సుషిమాగా గుర్తించారు. అయితే పోలీసుల విచారణలో అతడు షాకింగ్ విషయాలను వెల్లడించాడు. రైలులో ఓ మహిళ సంతోషంగా కనిపించడంతో దాడి చేసినట్టుగా నిందితుడు చెప్పినట్టుగా పలు జపాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సంతోషంగా కనిపించే మహిళలను చంపాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్టుగా నిందితుడు పోలీసులకు చెప్పాడు. అలాంటి వారిని చూస్తే తనకు కోపం వస్తుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. నిందితుడు వంట నూనె, లైటర్‌ని కూడా వెంట తెచ్చుకున్నాడనీ, రైల్లో నిప్పు పెట్టాలని కూడా ప్లాన్‌ చేశాడంటూ పోలీసులను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌కే బ్రాడ్‌కాస్టర్ పేర్కొంది.

    జపాన్ రాజధాని టోక్యో ప్రస్తుతం ఒలంపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ఆదివారంతో ముగియనున్నాయి. అయితే ప్రధాన జాతీయ స్టేడియానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక, జపాన్‌లో హింసాత్మక నేరాలు జరగడం చాలా అరుదు. కానీ కొందరు దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Japan, Tokyo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు