కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎంపిక చేసిన ప్లాట్లలోనే సుబ్బయ్యను కత్తులతో నరికి చంపారు. ప్రస్తుతం నందం సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుబ్బయ్య హత్య నేపథ్యంలో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఐతే అధికార పార్టీ నేతలే సుబ్బయ్యను హత్య చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సుబ్బయ్య హత్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను హత్య చేశారని ఆరోపించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే నందం సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేసినందునే ఈ కిరాతకానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టిడిపి నాయకుడి హత్య సిఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేట అన్నారు.
సుబ్బయ్య హత్యపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నాయకులు నందం సుబ్బయ్యను హతమార్చడం.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా..? రాష్ట్రాన్ని కత్తులు, కర్రలు, మారణాయుధాలతో పాలన చేస్తూ.. ప్రజానీకానికి ఫ్యాక్షన్ రాజకీయం చూపిస్తున్నారని ఆరోపించారు.
Published by:Purna Chandra
First published:December 29, 2020, 13:00 IST