Home /News /crime /

TELANGANA TO ANDHRA ILLEGAL LIQUOR SMUGGLING WITH THE HELP OF POLICE BA

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం... గుంటూరు జిల్లాలో ఓ పోలీస్ సహకారంతో..

గుంటూరు జిల్లాలో పట్టుబడిన మద్యం

గుంటూరు జిల్లాలో పట్టుబడిన మద్యం

గుంటూరు జిల్లా శావల్య పురం మండలం కారుమంచి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు 3,842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

  (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

  ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు భారీగా పెరిగిన వేళ.. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి లిక్కర్ అడ్డదారిలో తరలుతోంది. కొత్త కొత్తమార్గాల్లో మద్యం బాటిళ్లను బోర్డర్ దాటిస్తున్నారు. బియ్యం బస్తాలు, స్కూటర్ డిక్కీ, స్కూటీ డూమ్ వంటి వాటిలో దాచిపెట్టి సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే, ఈసారి మరింత భారీ స్థాయిలో మద్యం తెలంగాణ నుంచి ఏపీకి తరలింది. గుంటూరు జిల్లా శావల్య పురం మండలం కారుమంచి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు 3,842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లారీ, టాటా ఏస్, ఆటో, మూడు బైకులు, 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో మద్యం పోలీసుల కళ్లుగప్పి రాష్ట్రంలోకి రావడం ఎక్సైజ్ వర్గాలను ఆశ్చర్యపరించింది. ఇంత భారీగా మద్యం బోర్డర్ దాటడానికి ఓ పోలీస్ అధికారి సహకారం అందించినట్టు విచారణలో తేలింది. గతంలో శావల్యపురం ఎస్‌ఐగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం బోర్డర్ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. భారీగా తెలంగాణ మద్యం ఏపీలోకి రావడానికి ఆయనే ‘గేట్ పాస్’ ఇచ్చేశారు.

  మరోవైపు గుంటూరు జిల్లాలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. నరసరావుపేటలో విచ్చల విడిగా నిషేధిత గుట్ఖా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల అమ్మకం జోరుగా సాగుతోంది. గుట్కా వ్యాపారుల నుంచి నెలనెలా లక్షల్లో మామూళ్ళు వసూలు చేస్తూ చూసీ చూడనట్టే ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో జిల్లాలోని ముఖ్య పోలీసు అధికారికి సన్నిహితుడిగా పేరు గాంచిన పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ అధికారి వసూళ్ళకు భయపడి సదరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటేనే బాధితులు హడలెత్తి పోతున్నారు.

  కుటుంబ కలహాల నేపథ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలను వారి సమస్య పరిష్కరిస్తామంటూ వారి బలహీనతలను ఆసరాచేసుకుని శారీరకంగా లొంగదీసుకుంటున్నారు మరికొందరు ప్రభుద్ధులు. తనను ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మొసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయకుండా తాత్సారం చేశారు. కంప్లైంట్ వాపస్ తీసుకోవాలంటూ ఓత్తిడి చేశారు. కేసు నమోదు చేయకుండా డబ్బులు ఇప్పిస్తామని బేరమాడినట్టు విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఓ ఏఎస్‌ఐ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. అలాగే, క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ వారికి దన్నుగా నిలుస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ రాయుళ్ల వద్ద డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఒకేసారి ఏడుగురు సిబ్బంది పై వేటు పడినా తీరుమారడం లేదు.

  ఇక ఒక ఎస్ ఐ కోడిపందేలు, పేకాట స్థావరాలపై నిర్వహించిన దాడులలో సుమారు రూ.6లక్షల వరకు వసూలు చేసినట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఓ గ్రామంలో పేకాటస్థావరం పై దాడులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కు క్రింది దవడ పగిలి ఓ పన్ను కూడా విరిగినట్లు తెలియవచ్చింది. ఒక అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతున్నారని తెలిసి వారిపై దాడులు చేసే వారివద్ద నుండి లక్ష పై చిలుకు వసూలు చేశారని సమాచారం.

   
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Liquor sales

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు