ప్రమాదంలో ఆడబిడ్డ.. తగ్గుతున్న స్త్రీ జననాలు..

Telangana News: తెలంగాణలో 8 నెలల్లోపు పిల్లల్లో ప్రతి 1000 మంది మగ పిల్లలకు 929 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారట.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 28, 2019, 2:40 PM IST
ప్రమాదంలో ఆడబిడ్డ.. తగ్గుతున్న స్త్రీ జననాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఆడపిల్లల జననాలు తగ్గుతున్నాయా? లింగ వివక్షపై ప్రజలకు అవగాహన కొరవడుతోందా? అంటే తెలంగాణ ప్రభుత్వ ఈ-బర్త్‌ పోర్టల్‌లో జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు నమోదైన గణాంకాలు అవుననే అనుమానాలను కలిగిస్తున్నాయి. తెలంగాణలో 8 నెలల్లోపు పిల్లల్లో ప్రతి 1000 మంది మగ పిల్లలకు 929 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని పోర్టల్‌ చెబుతోందని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఐదు జిల్లాల్లో ఆడబిడ్డల జననాల సగటు 900 లోపుగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎనిమిది నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,61,769 మంది మగ పిల్లలు పుడితే.. 1,50,212 మంది ఆడ శిశువులు జన్మించారు. మగ పిల్లల జనన శాతం 52గా ఆడ పిల్లల జనన శాతం 48గా నమోదైంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే వికారాబాద్‌లో జిల్లాలో సగటు మెరుగ్గా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 973 మంది ఆడశిశువులు ఉన్నారు. జిల్లాల సగటుల్లో ఇదే అత్యధికం. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 881 మంది ఆడ శిశువులే జన్మిస్తున్నట్లు పోర్టల్ వివరించింది.

కాగా, లింగ నిష్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న లింగ నిర్ధారణ పరీక్షలేనన్న అభిప్రాయాలున్నాయి. గర్భస్థ శిశువు మగా? ఆడా? అనేది తెలుసుకునే పరీక్షలు నిర్వహణకు, వైద్యులు వెల్లడించడంపై నిషేధం ఉంది. అయితే, గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ అయితే గర్భంలోనే చిదిమేసే పరిస్థితులు నెలకొన్నాయని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>