మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆయన అంత్యక్రియలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో భాగంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా.. మారుతీరావు ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు అప్పగించారు. మార్కెట్ విలువ ప్రకారం.. రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించారు. తొలుత కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం చేసిన మారుతీరావు తర్వాత రైస్‌మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. 15 ఏళ్ల క్రితం రైస్‌మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. మిర్యాలగూడలో అమృత హాస్పిటల్ పేరుతో వంద పడకల ఆస్పత్రి ఉంది. పట్టణంలోనే అతడి భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి కూడా ఉంది.
అంతేకాదు.. మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో 22 గుంటల భూమి ఉంది. మిర్యాలగూడ, ఈదులగూడెం రోడ్లో షాపింగ్‌మాల్స్, మారుతీరావు తల్లి పేరు మీద రెండంతస్తుల షాపింగ్‌మాల్ కూడా ఉంది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో 400 గజాల ప్లాట్, వేర్వేరు చోట్ల 5 అపార్టుమెంట్లు ఉన్నాయి. ఇక, శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్ దాదాపు వంద విల్లాలు అమ్మారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Pranay amrutha