అప్పటి వరకు ఆ వివాహ వేడుక సజావుగా సాగింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా పెళ్లి వేడుకలో సంతోషంగా గడిపారు. అయితే పెళ్లి తంతు పూర్తై... భోజనాలు మొదలైన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్న వాళ్లు సైతం... ఆ తరువాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవ పెద్దది కావడంతో... వివాదం చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మొత్తం గొడవకు పెళ్లి భోజనంలో మటన్ లేకపోవడమే కారణం కావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పెళ్లి తంతు పూర్తయిన తరువాత బంధువులు భోజనాలు చేయడం మొదలుపెట్టారు. అయితే మెనూలో మటన్ లేకపోవడంపై వధువు తరపున బంధువులు వధువు తరపు బంధువులను ప్రశ్నించారు. అయితే మటన్ పెట్టే ఆర్థిక స్థోమత తమకు లేదనీ... అందుకే చికెన్ వంటకాలు చేయించామని వధువు తరపు బంధువులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో గొడవ ఎక్కువైంది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుని భౌతికదాడులకు దిగారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మందికి గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించినదిగా చెప్పుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana