దేశం, రాష్ట్రంలో ఇటీవల మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరగడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఇలాంటి ఘటనలు అరికట్టడానికి శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులు, సోషల్ మీడియాలో వారిపై అనుచితంగా పోస్టులు పెట్టే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా వారిలో పరివర్తన తీసుకువచ్చేలా ప్రయత్నిస్తోంది. వారి మానసిక పరిస్థితిని తెలుసుకుని అందుకు తగిన విధంగా కౌన్సెలింగ్ ఇవ్వడం కోసం సైకాలజిస్టులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత పెడదారి పట్టకుండా వారిలో చెడు ఆలోచనలు మొదలైనప్పుడే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మార్చవచ్చని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ కు హాజరైన అనేక మంది యువకులు తమలో మార్పు వచ్చిందని.. ఇక మీదట ఇలాంటి చర్యలకు పాల్పడమని చెప్పడం విశేషం. తమలో మార్పు కలగడానికి కారణమై షీ టీం సభ్యులకు వారు ధన్యవాదాలు చెప్పడం ఈ కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితం వస్తుందనడానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
మహిళలను వేధిస్తూ, సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు 200 మంది యువకులకు ఆన్ లైన్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చారు. మీరంతా మీదట జాగ్రత్తగా ఉండాలని లేక పోతే కఠిన చర్యలు తప్పవని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ శ్రీమతి స్వాతి లక్రా ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. ఏదైనా పోలీసులు కొంత మేరకే భరించ గలుగుతారని.. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మీరు ఇతరులతో ప్రవర్తించినట్లు మీ కుటుంబ సభ్యులను కూడా ఎవరైనా వేధిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సమాజంలో ప్రతీ మహిళను గౌరవించాలని అవగాహన కల్పించారు. మార్పు మీ నుంచే మొదలు కావాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ కౌన్సెలింగ్ కు హాజరయ్యారు. దీంతో వారికి కూడా స్వాతీ లక్రా పలు సూచనలు చేశారు.పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.
ఈ కౌన్సెలింగ్ లో పాల్గొన్న మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. దేశంలో ఈ విధమైన కౌన్సెలింగ్ కి ఒక విధానమంటూ లేదన్నారు. మన రాష్ట్రంలోనే ఒక మోడల్ కౌన్సెలింగ్ ను రూపొందించి మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని మార్చగలుగుతున్నామన్నారు. ఇందుకు అన్ని జిల్లాల షీ టీంలు చేస్తున్న కృషి మరువలేదన్నారు. ప్రతీ జిల్లాలో షీ టీమ్ సభ్యులు మహిళల సమస్యపై చాలా వేగంగా స్పందిస్తున్నారని అభినందించారు. ఇక మీదట ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని దిశా నిర్ధేశం చేశారు.
ఈ కౌన్సెలింగ్ లో ప్రముఖ సైకాజిస్టులు కూడా పాల్గొని నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రముఖ విద్యావేత్త, ఫ్లేమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఇందిరా పారిఖ్ పాల్గొని నిందితుల్లో మార్పురావడానికి కొన్ని సూత్రాలు చెప్పారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా ప్రయోగాత్మక విధానాల ద్వారా కౌన్సిలింగ్ కు హాజరైన వారిలో మార్పు తీసుకువచ్చేలా అవగాహన కల్పించారు. కౌన్సెలింగ్ కు హాజరైన కొందరు వ్యక్తులు తమలో మార్పు వచ్చిందని చెప్పారు. జిల్లా షీ టీమ్ సభ్యులు తమలో పరివర్తన వచ్చేలా ప్రయత్నం చేశాయని తెలిపారు. ఇక మీదట ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడమని చెప్పటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.