Teen kills mother over PUBG: ఈ కాలంలో పిల్లలు మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటు పడిపోయారు. చేతికి సెల్‌ఫోన్ ఇస్తే చాలు రోజంతా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. మొదట సరదాగా మొదలై ఆ తర్వాత వ్యవసంగా మారే ఈ అలవాటు వల్ల కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తిండి, తిప్పలు మానేసి గంటల కొద్ది గేమ్స్ ఆడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాగే పబ్‌జీ(PUBG)గేమ్‌కి బానిసైన అయిన ఓ బాలుడు ఏకంగా తన తల్లినే చంపేశాడు(Teen Kills Mother). పబ్‌జీ గేమ్ ఆడకుండా అడ్డుకున్నందుకు ఆమెను గన్‌తో కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘోరం జరిగింది.
ఉత్తరప్రదేశ్(UttarPradesh)రాజధాని లక్నోలోని పీజీఐ ప్రాంతంలో సాధన అనే మహిళ.. తన 16 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కతాలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకునేది. అయితే సాధన కుమారుడు పబ్‌జీ గేమ్‌కు బానిసైపోయాడు. దీంతో ఆ అలవాటును మానుకోవాలని కుమారుడిని సాధన పలుసార్లు హెచ్చరించింది. అయితే తరచూ తనను ఆడుకోకుండా చేస్తున్న తల్లిపై కోపం పెంచుకున్నాడు. శనివారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో.. తన తండ్రి లైసెన్స్ తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. మృతదేహం దుర్వాసన రాకుండా గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్‌నర్లను(Freshner)స్ప్రే చేశాడు. తమ అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదని, అందుకే తన తల్లి వారి దగ్గరకు వెళ్లిందని పొరుగువారికి చెప్పి నమ్మించాడు. అయితే, మంగళవారం రాత్రి 8 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి ఇంట్లో రిపేర్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రిషన్ అమ్మను చంపేశాడని చెప్పాడు. ఇదే విషయాన్ని అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుల్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Fire Accident : మెట్రో పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం...కాలి బూడిదైన వాహనాలు
Train Derailment : పట్టాలు తప్పిన రైలు..21 మంది మృతి,50 మందికి పైగా గాయాలు
పోలీసులు ఘటనాస్థలికి రాగానే బాలుడు వారికి కట్టుకథ చెప్పాడు. తమ ఇంటికి వచ్చిపోయే ఓ ఎలక్ట్రిషీయనే ఈ హత్యకు పాల్పడినట్లు బాలుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మరోవైపు, మృతదేహం పూర్తిగా పురుగులు పట్టిపోయిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. శవం చుట్టూ రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించడంతో బాలుడు నేరం అంగీకరించక తప్పలేదు. ఇంట్లో మృతదేహం ఉన్న రెండు రోజుల పాటు చెల్లెలికి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చాడని.. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు రూమ్ ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడని పోలీసులు తెలిపారు. ఇటీవల సాధన ఇంట్లో నుంచి రూ.10వేలు పోయాయని... బాలుడే తీసి ఉంటాడని తల్లి అనుమానించి... కొడుకును గట్టిగా నిలదీసిందని, హత్యకు మూడు రోజుల ముందు బాలుడిని తీవ్రంగా కొట్టిందని.. అయితే చివరకు డబ్బులు ఇంట్లోనే కనిపించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు దొంగిలించానని తనను అవమానించడంతో పాటు పబ్‌జీ ఆడొద్దని అడ్డుకుంటుందనే కోపంతో గన్‌తో తల్లిని కాల్చి చంపాడని తెలిపారు. హత్యకు సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే తనను కూడా చంపేస్తానని బెదిరించాడని బాలుడి చెల్లి వెల్లడించింది. బాలుడు నేరం అంగీకరించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PUBG, Son kills his mother, Uttar pradesh