వలంటీర్లపై మూకుమ్మడి దాడి...టీడీపీ నేతల దాష్టీకం

వలంటీర్‌గా పనిచేస్తున్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కొల్లం వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: May 23, 2020, 1:20 PM IST
వలంటీర్లపై మూకుమ్మడి దాడి...టీడీపీ నేతల దాష్టీకం
వలంటీర్లపై మూకుమ్మడి దాడి...టీడీపీ నేతల దాష్టీకం
  • Share this:
చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి : మాజీ మంత్రి, టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ గుడికాటి విజయ్‌కుమార్‌ కథనం మేరకు.. మన్నవరం పంచాయతీలో కొల్లం వంశీ (21), సి.జయప్రకాష్‌ (24), సి.శ్రీనివాసులు (24) గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి వారు గురువారం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే స్థానిక టీడీపీ నేత, శ్రీకాళహస్తి మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ రంగినేని చెంచయ్య నాయుడు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి తీసుకుపోయాడు. తాళాలు అడిగినా ఇవ్వలేదని చెంచయ్య నాయుడుపై వలంటీర్లు ఎంపీడీవో బాలాజీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన చెంచయ్య నాయుడు మరియు అతడి అనుచరులు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు లాక్కుని వెళ్లిపోయారు. ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తుండగా మరోమారు టీడీపీ నేతలు చెంచయ్య నాయుడు, రాంబాబు నాయుడు, చెంచుకృష్ణయ్య, వెంకటేశ్వరావు, శ్రీనివాసులు, శివ తదితరులు మూకుమ్మడిగా వలంటీర్లపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వలంటీర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకరలు.. చెంచయ్య నాయుడు, కోటి, నరేష్‌ దాడులకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిపై కూడా దాడికి దిగారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డవారిని స్థానికులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

వలంటీర్‌గా పనిచేస్తున్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కొల్లం వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి చేసిన రంగినేని చెంచయ్యనాయుడు, రాంబాబు నాయుడు, తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వలంటీర్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్తే తమను చంపే ప్రమాదం ఉందని విలపించారు.

Published by: Venu Gopal
First published: May 23, 2020, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading