తమిళనాడు: తండ్రి, తనయుడి లాకప్‌డెత్ కేసు...మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్

Tamilnadu Custodial Deaths: ఈ కేసులో సస్పెండ్ అయిన ప్రధాన నిందితుడైన సబ్ ఇనిస్పెక్టర్‌ రఘు గణేశ్‌ను సీబీసీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేయగా...ఇవాళ వేకువజామున మరో ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు.

news18-telugu
Updated: July 2, 2020, 8:42 AM IST
తమిళనాడు: తండ్రి, తనయుడి లాకప్‌డెత్ కేసు...మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్
పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించిన జయరాజ్, ఆయన తనయుడు బెనిక్స్(ఫైల్ ఫోటో)
  • Share this:
తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో సంచలనం సృష్టించిన తండ్రి, తనయులు(జయరాజ్, బెన్నిక్స్) లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురు పోలీసులను ఆ రాష్ట్ర సీబీసీఐడీ పోలీసుల గురువారం వేకువజామున అరెస్టు చేశారు. దేశ వ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ కేసులో సబ్ ఇనిస్పెక్టర్ బాలకృష్ణన్, కానిస్టేబుల్స్ ముత్తురాజ్, మురుగన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్ ఇనిస్పెక్టర్‌ రఘు గణేశ్‌ను సీబీసీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దీంతో అమెరికాలో పెను దుమారంరేపుతున్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో పోల్చుతున్న ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య నాలుగుకు చేరింది. గత రాత్రి రఘు గణేశ్‌ను సీబీసీఐడీ అరెస్టు చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన ట్యూటికోరిన్ జిల్లా సాత్తాన్‌కుళంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి బాణాసంచాలు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రఘు గణేశ్‌పై హత్యా నేరం కింద( ఐపీసీ సెక్షన్ 302) కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్ షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి అత్యంత కిరాతకంగా కొట్టి చంపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన తమిళనాడు పోలీసులకు ఎప్పటికీ మచ్చగా మిగిలిపోనుంది. తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేసింది. అటు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తమిళనాడు డీజీపీ, జైళ్ల శాఖ ఐజీ, ట్యూటికోరిన్ జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లోగా స్వయంగా తమ ఎదుట హాజరై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.ఇంతకీ ఏం జరిగిందంటే?
ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో జయరాజ్(59), ఆయన తనయుడు బెనిక్స్(31) మొబైల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంగా స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు...రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో తండ్రి, తనయులు ఇద్దరూ మృతి చెందారు. బెనిక్స్ 21న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా...మరుసటి రోజు 22న ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారు గుండెపోటుతో మరణించారని చెబుతూ తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు లాఠీలతో అమానుషంగా కొట్టినందున తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యుతలైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వాదనకు బలం చేకూర్చేలా అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రేవతి..ఆ రోజు రాత్రంతా పోలీసులు తండ్రి, తనయులను కొట్టినట్లు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

తమిళనాడు పోలీసుల బ్రూటాలిటీపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో సంచనంరేపుతున్న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఈ ఘటనను పోల్చుతూ తమిళనాడు పోలీసును తీరును పలువురు సెలబ్రిటీలు ఎండగట్టారు. దేశ, విదేశీ మీడియా కూడా తమిళనాడు పోలీసుల రాక్షసత్వాన్ని తూర్పారబట్టాయి.
First published: July 2, 2020, 8:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading