వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లా బోదినాథం గ్రామానికి చెందిన వరదరాజు అలియాస్ శివరాజ్(35), వసంతనాదై గ్రామానికి చెందిన ఆషా (23) మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. శివరాజుకి ఇది రెండో వివాహం. శివరాజు, ఆషా కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. శివరాజు ఓ రైస్ అమ్మే దుకాణం నడుపుతూ భార్యను ఉన్నంతలో బాగానే చూసుకునేవాడు. ఈ దంపతులకు పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు లేరు.
భార్యాభర్తల మధ్య ఈ విషయంలో ఇటీవల మనస్పర్థలు తలెత్తాయి. లోపం నీలో ఉందంటే నీలో ఉందంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. ఇదే సమయంలో.. వ్యాపారంలో శివరాజు నష్టపోయాడు. అతని దగ్గర రైస్ బ్యాగ్స్ తీసుకెళ్లిన చాలామంది డబ్బులు రేపుమాపు ఇస్తామంటూ ఎగ్గొట్టారు.
ఈ పరిణామాలన్నీ శివరాజు తీవ్రంగా బాధించాయి. రైస్ బిజినెస్‌లో నష్టాలను చవిచూసిన విషయాన్ని భార్యతో చెప్పిన శివరాజుకు ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యలు మరింత చిచ్చుపెట్టాయి.
భార్యాభర్తలిద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. శివరాజుకు ఇంట్లో మనశ్శాంతి కరువైంది. అతని భార్య ఆషా కూడా తన జీవితం నాశనమైపోయిందంటూ తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో కూర్చుని లోలోపల కుమిలిపోతుండేది. ఈ క్రమంలో ఇక ఈ బాధలు భరించలేమని భావించి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సంతానలేమితో పాటు ఆర్థికంగా ఎదురైన సమస్యలను తట్టుకోలేక శివరాజ్(35), ఆషా(23) ఆగస్ట్ 29 రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆగస్ట్ 30న ఎంతసేపటికీ వీళ్ల ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఉదయం 10 గంటల సమయంలో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చింది. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి భార్యాభర్తలు ఉరికి వేలాడుతూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Very Sad: ఎంతటి విషాదం.. కుప్పకూలిన యువ జవాను కాపురం.. 2019లో పెళ్లి.. ఇంతలోనే..
ఒకే చీరతో ఇద్దరూ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఇన్‌స్పెక్టర్ సుబ్బలక్ష్మి, సబ్ ఇన్‌స్పెక్టర్ గుణశేఖర్ స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి శివరాజ్, ఆషా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. శివరాజ్ రాసిన సూసైడ్ నోట్‌లో ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది.
చాలామంది తన దగ్గర రైస్ కొనుక్కుని డబ్బులివ్వకుండా తనను మోసం చేశారని చెప్పుకొచ్చిన శివరాజ్ తమకు పిల్లలు పుట్టకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాశాడు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదని సూసైడ్ నోట్‌లో శివరాజ్ స్పష్టం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Couple died, Crime news, Tamilnadu, Wife and husband died