హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tamil Nadu: ట్రాన్స్ జెండర్ మహిళపై అమానుషం.. భర్త కుటుంబ సభ్యులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి.. ఆ తర్వాత..

Tamil Nadu: ట్రాన్స్ జెండర్ మహిళపై అమానుషం.. భర్త కుటుంబ సభ్యులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి.. ఆ తర్వాత..

తీవ్రంగా గాయపడ్డ ట్రాన్స్ జెండర్..

తీవ్రంగా గాయపడ్డ ట్రాన్స్ జెండర్..

Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగులోనికి వచ్చింది. ట్రాన్స్ మహిళపై.. ఆమె భ‌ర్త కుటుంబ స‌భ్యులు దారుణానికి పాల్పడ్డారు.

Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అమానుషకర సంఘటన జ‌రిగింది. ఒక ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె కుటుంబ సభ్యులు సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. సదరు, ట్రాన్స్ జెండర్ తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నందుకు అత‌ని కుటుంబ స‌భ్యులు ఘోరానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాలు.. ఆంధ్ర‌ప్రదేశ్ నెల్లూరు జిల్లా పనకుడి గ్రామానికి చెందిన ఉదయ ట్రాన్స్‌జెండర్ గా మారారు. ఆమె ప్రస్తుతం త‌మిళ‌నాడులోని పాలవూరులో నివసిస్తున్నాడు. ఈ క్ర‌మంలో కూడంకుళం సమీపంలోని శ్రీరంగనారాయణపురానికి చెందిన బాల ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. అది వారిమధ్య ప్రేమకు దారితీసింది. వారిద్ద‌రు కలిసి కొన్ని నెలలపాటు స‌హజీవ‌నం చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు వారం క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో.. బాల ఆనంద్, ఉద‌య‌ల వివాహం గురించి తెలుసుకున్న బాల ఆనంద్ కుటుంబీకులు వారిని వెతుక్కుంటూ పాలవూరు వచ్చారు. వారిద్ద‌రి పెళ్లిని అంగీక‌రించినట్టు న‌మ్మించి.. బాల ఆనంద్ తండ్రి బాలమురుగన్, సోదరుడు సుభాష్, బంధువులు మణికందన్, శక్తివేల్, మరికొందరు వారిని తమ స్వస్థలానికి తీసుకెళ్తామని నమ్మించారు. ఈ క్ర‌మంలో బాల ఆనంద్ కుటుంబ సభ్యులు.. కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపారు. అక్కడ.. తమ నిజస్వరూపం బయట పెట్టారు. ట్రాన్స్ జెండర్ ఉద‌య‌ పట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

అంతటితో ఆగకుండా.. ఆమె పై విచ‌క్ష‌ణ ర‌హితంగా భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆ తర్వాత... ఆమెను నడిరోడ్డుపై వదిలేసి వారు వెళ్లిపోయారు. బాలానంద్ ను బెదిరించి.. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. భ‌ర్త కుటుంబీకుల దాడిలో ట్రాన్స్‌జెండర్ ఉద‌య‌ ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రోడ్డుపై అనాథలా పడిఉంది. ఈ క్రమంలో స్థానికులు ఆమెను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో.. ట్రాన్స్ జెండర్ ఉద‌య స‌మాచారం తెలియ‌క‌పోవ‌డంతో.. ట్రాన్స్ కమ్యూనిటీ .. కూడంకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదును నమోదు చేశారు. ఆ తర్వాత.. జరిగిన దారుణం వారికి తెలిసింది. దీంతో.. నిందితులపై ట్రాన్స్‌జెండర్ (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద కేసు నమోదు చేశారు. తను నమ్మి ప్రేమించిన యువకుడు కూడా తనపై దాడికి కారణమని ట్రాన్స్ జెండర్ యువతి కన్నీటి పర్యంతమయ్యింది. తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ చట్టం కింద తొలి కేసు నమోదు కావడం గమనార్హం.

పోలీసులు బాల ఆనంద్, బాలమురుగన్, లెట్సుమి, శక్తివేల్ మరియు మణికందన్‌లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. మిగతావారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. దీనిపై తమిళనాట తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఒక ట్రాన్స్ మహిళపై ఈ విధంగా అమానుష దాడిని అందరు ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Attack, Crime news, Tamil nadu, Transgender

ఉత్తమ కథలు