ఆ యువతి ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది. కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్న రోజులకు ఆమెను శాంతిప చేసిన భర్త.. తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని (Tamil Nadu) కొయంబత్తూరు జిల్లాలో (Coimbatore District) చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపూర్ జిల్లా నేత కార్మికుల కాలనీకి చెందిన అన్నాథురై పెద్ద కూతురు ఇలకియా(27). ఆమెకు కొయంబత్తూరు రామనాథపురాని చెందిన శరవణన్, జయంతి దంపతుల కొడుకు రామ్ ప్రకాష్‌తో వివాహం జరిపించారు.
వివాహ సమయంలో వరుడు రామ్ ప్రకాష్‌కు పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, ఒక కారు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులు ఇలకియా కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఇలకియా అత్తమామలు శరవణన్, జయంతిలు.. మరిన్ని ఆభరణాలు, డబ్బులు కావాలని అడిగినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే తీవ్రంగా బాధపడిన ఇలకియా.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. మరోవైపు అదనపు కట్నం కోసం భర్త రామ్ ప్రకాష్ కూడా ఇలకియాను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇలకియా మార్చి నెలలో తన తల్లికి ఇంటికి తిరిగి వచ్చింది.
అయితే ఒక నెల తర్వాత రామ్ ప్రకాష్ ఇలకియాకు ఫోన్ చేసి ఆమెను శాంతిపజేశాడు. బాగా చూసుకుంటానని చెప్పాడు. అయితే ఆ మాటలు నమ్మిన ఇలకియా.. భర్త రామ్ ప్రకాష్‌తో కలిసి అతని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత మరోసారి ఇలకియాకు వేధింపులు మొదలయ్యాయి. రూ. 5 లక్షలు తీసుకురావాలని అత్తింటి వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలకియా తల్లిదండ్రులు తొలుత లక్ష రూపాయలు ఇచ్చారు.
ఇక, నిన్న సాయంత్రం రామ్ ప్రకాష్.. ఇలకియా తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుని ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెంటనే రావాలని చెప్పాడు. దీంతో ఇలకియా తల్లిదండ్రులు వెంటనే కొయంబత్తూరులోని రామ్ ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూతురు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఇలకియా తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రామనాథపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కొయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలకియా మరణాన్ని.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
తమ కూతురు శరీరంపై గాయాలు ఉన్నాయని, వరకట్నం కోసం రామ్ ప్రకాష్ కుటుంబమే ఆమెను చంపి ఉరివేసి ఉండవచ్చని ఇలకియా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కూతురి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.