తమిళనాడు: తండ్రి తనయుడి లాకప్ డెత్ కేసు...సీబీఐకి బదిలీ

Jayaraj and J Beniks Death Case | తమిళనాడులో పెను సంచలనం సృష్టించిన తండ్రి, తనయుడి లాకప్ డెత్ కేసును సీబీఐకి బదిలీచేయాలని పళనిస్వామి సర్కారు నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: June 28, 2020, 7:41 PM IST
తమిళనాడు: తండ్రి తనయుడి లాకప్ డెత్ కేసు...సీబీఐకి బదిలీ
పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించిన జయరాజ్, ఆయన తనయుడు ఫెనిక్స్(ఫైల్ ఫోటో)
  • Share this:
Jayaraj and Beniks Death Case: తమిళనాడులో తండ్రి తనయుడు లాకప్ డెత్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పెను దుమారంరేపుతున్న జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో పోల్చుతున్న ఈ ఘటనపై...తమిళనాట రాజకీయ దుమారం తార స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తండ్రి తనయులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి బదిలీచేయాలని అక్కడి పళనిస్వామి సర్కారు నిర్ణయించింది. ఈ కేసును సీబీఐ విచారణ జరపనుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని తదుపరి విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టుకు తెలియజేయనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు.

ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో జయరాజ్(59), ఆయన తనయుడు బెనిక్స్(31) మొబైల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంగా స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు...రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో తండ్రి, తనయులు ఇద్దరూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెనిక్స్ 21న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా...మరుసటి రోజు 22న ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే  పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు లాఠీలతో అమానుషంగా కొట్టినందున తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరినీ పోలీసులే చంపేశారని ఆరోపిస్తున్నారు. బాధ్యుతలైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తండ్రి, తనయుడి లాకప్ డెత్ వ్యవహారంపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను అమెరికాలో పెను దుమారంరేపుతున్న జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో పోల్చుతున్నారు. అటు జాతీయ స్థాయిలోనూ పలువురు మానవ హక్కుల సంఘాల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు, సీనియర్ పాత్రికేయులు పోలీసుల దమనకాండను నిరసిస్తూ తమ గళం వినిపిస్తున్నారు.


తండ్రి, తనయుల లాకప్ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన తమిళనాడు సర్కారు...మరికొందరిపై బదిలీవేటు వేసింది. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. అయితే జయరాజ్ కుటుంబసభ్యులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి చెందడం లేదు. బాధ్యులైన పోలీసులపై కేసు నమోదుచేసి అరెస్టు చేయడంతో పాటు...వారికి జీవిత ఖైదు శిక్షపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ దీన్ని సుమోటో కేసుగా స్వీకరించింది. తండ్రి, తనయుల లాకప్ డెత్ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపిన సీఎం పళనిస్వామి..తదుపరి విచారణ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేస్తామన్నారు. కోర్టు అనుమతి తీసుకుని ఈ కేసును సీబీఐకి బదిలీచేయనున్నట్లు తెలిపారు. కోర్టు సుమోటో కేసుగా పరిగణించడం పట్ల జయరాజ్, బెనిక్స్ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కోర్టు ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ఒత్తిడి కారణంగానే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ పళనిస్వామి సర్కారు నిర్ణయం తీసుకుందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. తండ్రి, తనయుల మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకునే రాజకీయ తెగువ, చిత్తశుద్ధి పళనిస్వామి సర్కారుకు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
First published: June 28, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading