వెల్లూరు: భార్యాభర్తల మధ్య ఎన్నటికీ ప్రవేశించకూడనిది అనుమానం. ఒక్కసారి ఏ ఒక్కరిలో అప నమ్మకం మొదలైనా అది చివరకు అనర్ధానికి దారి తీస్తుందనడంలో సందేహమే లేదు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిన ఘటన తాజాగా తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణమలై జిల్లా కలస్తంబడి గ్రామానికి చెందిన రాజా (33), గౌతమికి(28) కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. తొమ్మిదేళ్ల వయసున్న బాబు, ఆరేళ్ల వయసున్న పాప ఉన్నారు. గత కొన్ని నెలలుగా రాజా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగడానికి డబ్బులు కావాలని భార్యను వేధిస్తుండేవాడు. పిల్లలను పట్టించుకోవడం మానేశాడు.
ఇది కూడా చదవండి: OMG: పెళ్లయి ఒక బాబు ఉన్నాడు.. రెండోసారి గర్భం దాల్చింది.. కానీ ఏమైందంటే..
కుటుంబ పోషణ కోసం అప్పటివరకూ నడిపిన ఆటో డ్రైవింగ్‌కు వెళ్లడం మానేశాడు. ఇంతటితో ఆగకుండా.. అనుమానంతో భార్యను రోజూ వేధిస్తూ తిట్టి కొట్టి హింసించేవాడు. ఈ క్రమంలోనే.. గౌతమి జనవరి 6వ తేదీ సాయంత్రం నుంచి కనిపించలేదు. గౌతమి ఆచూకీ కోసం ఆమె బంధువులు, సన్నిహితులు వెతకని చోటు లేదు. కానీ.. ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం రాజా తల్లి పచ్చైఅమ్మల్ పొలానికి వెళ్లింది. చెరకు పంట వేసిన పొలంలో గౌతమి మృతదేహం కాలిపోతున్న దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాకైంది. భయంతో కేకలేసింది.
దీంతో.. ఏమైందా అని కొందరు అక్కడికి చేరుకుని చూశారు. గౌతమిని ఆ స్థితిలో చూసి నివ్వెరపోయారు. మంగళం పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం అందింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని గౌతమి మృతదేహాన్ని తిరువన్నమలై గవర్నమెంట్ హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. గౌతమి హత్య కేసులో ఆమె భర్త రాజాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
తొలుత పొంతన లేని సమాధానాలు చెప్పినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపెట్టాడు. తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. మద్యం తాగేందుకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం లేదని కూడా ఆమెను క్షణికావేశంలో హత్య చేసినట్లు చెప్పాడు. భార్యపై అనుమానంతో ఇంత దారుణానికి ఒడిగట్టిన రాజాను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జనవరి 6న ఆమెను ఉరేసి ఎవరూ చూడకుండా ఆమె మృతదేహాన్ని పొలానికి తీసుకెళ్లి పడేసినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు. ఆ తర్వాత ఊళ్లోకి వచ్చి పెట్రోల్ కొనుక్కుని వెళ్లి గౌతమి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించానని రాజా చెప్పాడు. ఇదిలా ఉండగా.. ఇద్దరు పిల్లలు చిన్న వయసులో తల్లిని దూరమయ్యారు. తండ్రి జైలు పాలయ్యాడు. నానమ్మ పిల్లలను చూసుకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ తల్లి లేని లోటును ఆ బిడ్డలకు ఎవరూ తీర్చలేరన్నది వాస్తవం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.