మద్యం మత్తు కొన్ని సందర్భాల్లో మనిషిని మృగంగా మార్చేస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అన్నదమ్ములు అనే తారతమ్యం కూడా చూడలేనంతగా మత్తు మనిషిని ఆవహిస్తుంది. ఆ మత్తులోనే దారుణాలు, ఘోరాలు, ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తుంటారు. అయితే ఇదంతా తెలిసి చేశారా లేక మందు నిషా నషాళానికి ఎక్కవడం వల్ల చేశారా అంటే రెండు తరహా సంఘటనలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. సూర్యాపేట(Suryapeta)జిల్లాలో కూడా అదే జరిగింది. స్నేహితులంతా కలిసి మందు తాగిన తర్వాత మద్యం మత్తులో తమతో కలిసి మద్యం తాగిన ఒకరిని హత్య చేశారు.
మద్యం మత్తులో మర్డర్ ..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజునాయక్ తండాలో ఈ దారుణం జరిగింది. తండాకు చెందిన సంపంగి ప్రవీణ్ అనే పాతికేళ్ల యువకుడిని తోటి స్నేహితులే అత్యంత దారుణంగా హతమార్చారు. మృతుడు ప్రవీణ్ భార్య ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసుకున్నారు. ప్రవీణ్‌ని హత్య చేసిన కోసులో దోషుల్ని గుర్తించారు. ప్రవీణ్‌తో పాటు మరికొందరు స్నేహితులు కలిసి మద్యం సేవించినట్లుగా నిర్ధారించారు. మద్యం ఫూటుగా తాగిన తర్వాత మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ హత్యకు దారి తీసింది. అంతే ఆ ఘర్షణలోనే అందరూ కలిసి ప్రవీణ్‌ని హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు.
ఫ్రెండ్‌నే పైకి పంపించిన స్నేహితులు..
తోటి స్నేహితుడ్ని చంపిన తర్వాత మృతదేహాన్ని అర్వపల్లి మండలం తిమ్మాపురం గుట్టలో పడేశారు. ఈకేసులో హత్యతో సంబంధం ఉన్నకొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నింధితుడు హరిని అరెస్ట్ చేశారు. హత్యలో ప్రమేయం ఉన్న మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వాళ్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా తెలిపారు. ప్రవీణ్‌ని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది...ఎందుకు తిమ్మాపూరం గుట్టలో పడేశారనే విషయాన్ని పోలీసుల అదుపులో ఉన్న హరి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ హత్య వెనుక పాతకక్షలు ఉన్నాయా లేక డబ్బుల విషయంలో ఏవైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
అతిగా తాగడమే ప్రమాదం..
తాగిన మైకంలో వాహనం నడపటం ఎంత ప్రమాదకరమో..ఫ్రెండ్స్‌తో గొడవ పడటం అంతకంటే డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందరూ మత్తులో ఉండటంతో ఎవర్ని ఎవరూ కంట్రోల్ చేసుకోలేరని ఆ కోపంతోనే ఒకరిపై మరొకరు ఈతరహా దారుణాలకు పాల్పడుతూ ఉంటారని సూచిస్తున్నారు. అందుకే అందరూ కలిసి మద్యం తాగాలని నిర్ణయించుకున్న సమయంలో మితంగా తాగితే గొడవలు జరిగే పరిస్థితి రాదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.