SUPERVISOR ATTACKS MIGRANT WORKERS IN VIKARABAD SK
వలస కూలీల తలలు పగలగొట్టిన సూపర్ వైజర్. . వికారాబాద్లో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
న్యాయంగా తమకు రావాల్సిన కూలీ డబ్బులను సూపర్వైజర్ని అడిగారు. ఆ డబ్బులిస్తే ఎలాగోలా సొంతూళ్లకు వెళ్తామని చెప్పారు. ఐతే తమనే డబ్బులు అడుగుతారా అంటూ.. సూపర్ వైజర్ చెలరేగిపోయాడు. వలస కూలీలపై దాడి చేసి ఇష్టానుసారం చితకబాదాడు.
వలస కార్మికులపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించింది. వారు కార్మికులు కాదని.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములని ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. కరోనా లాక్డౌన్లో వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రేషన్తో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థికం చేస్తున్నామని తెలిపారు. షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసి వలస కార్మికులకు నిత్య భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఐనప్పటికీ సొంతూళ్లకు వెళ్లదలచుకున్న వారికి.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. భోజన పెట్టి.. టిక్కెట్లు ఇచ్చి సొంతూళ్లకు పంపిస్తున్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఇంత చేస్తున్నా.. కొందరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కూలీ డబ్బులు అడిగినందుకు ఓ సూపర్ వైజర్ చిత్రహింసలు పెట్టాడు. వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. పరిగి మండలం రంగాపూర్లోని ఓ ప్లైవుడ్ కంపెనీలో వేరే రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేస్తున్నారు. ఐతే కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవటంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ఉంటే కష్టాలు తప్పవని.. స్వస్థలాకు వెళ్లడమే మంచిదని నిర్ణయించారు. ఈ క్రమంలో న్యాయంగా తమకు రావాల్సిన కూలీ డబ్బులను సూపర్వైజర్ని అడిగారు. ఆ డబ్బులిస్తే ఎలాగోలా సొంతూళ్లకు వెళ్తామని చెప్పారు. ఐతే తమనే డబ్బులు అడుగుతారా అంటూ.. సూపర్ వైజర్ చెలరేగిపోయాడు. వలస కూలీలపై దాడి చేసి ఇష్టానుసారం చితకబాదాడు. కొందరి తలలను పగులకొట్టి.. కాళ్లు విరగొట్టి క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వలస కార్మికుల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.