హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్.. పొలానికి ఆమే పిలిచింది

నిందితుడు సందీప్‌ను బాధితురాలు ప్రేమిస్తోందని.. అందుకే పొలాల్లోకి పిలిచిందని రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ అన్నారు. అవారా యువతులు చెరకు, మొక్కజొన్న, జొన్న పొలాల్లో పొదలు, అడవుల్లో తరచూ మరణిస్తూ కనిపిస్తుంటారని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 7, 2020, 9:33 AM IST
హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నేత షాకింగ్  కామెంట్స్.. పొలానికి ఆమే పిలిచింది
బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ
  • Share this:
హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ దారుణంపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. యోగి ఆదిత్యనాథ్ హయంలో యూపీలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని.. గూండారాజ్‌గా మారిపోయిందని విపక్షాలు భగ్గమంటున్నాయి. నిందితులను వెనకేసుకొస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. ఈ క్రమంలో అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాథ్రస్ బాధిత యువతికి నిందితుడు సందీప్ ఠాకూర్‌తో సంబంధం ఉందని, నేరం జరిగిన రోజు ఆ యువతే నిందితుడిని చేనుకు పిలిచిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితులు అమాయకులని, బాధిత యువతి అవారా అని ఆయన వ్యాఖ్యానించారు.

నిందితుడు సందీప్‌ను బాధితురాలు ప్రేమిస్తోందని.. అందుకే పొలాల్లోకి పిలిచిందని రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ అన్నారు. అవారా యువతులు చెరకు, మొక్కజొన్న, జొన్న పొలాలు, పొదలు, అడవుల్లో తరచూ మరణిస్తూ కనిపిస్తుంటారని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. సీబీఐ చార్జిషీటు దాఖలు చేసే వరకూ హాథ్రస్ నిందితులను జైలు నుంచి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంజిత్ బహదూర్‌పై ఇప్పటికే 44కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. అలాంటి హాథ్రస్ బాధితురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మళ్లీ యూపీలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీసులు కూడా మృతురాలు, నిందితుడు కొన్ని నెలలుగా ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని వెల్లడించిన విషయం తెలిసిందే. మృతురాలి సోదరుడి పేరిట ఉన్న నెంబర్ నుంచి సందీప్‌ ఠాకూర్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు, వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు 100కు పైగా ఫోన్స్ కాల్స్ జరిగినట్లు కాల్ డిటెయిల్ రిపోర్టులో (CDR) తేలిందని తెలిపారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ కాల్స్‌ను గుర్తించామని చెప్పారు. బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, యూపీలోని హత్రాస్‌ జిల్లాలో సెప్టెంబరు 14 20 ఏళ్ల దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. పొలంలో తల్లి, సోదరులతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి నాలుకను కోశారు. మెడను విరిచి గొంతు నులిమారు. అగ్ర కులాలకు చెందిన పలువురు వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మొదట అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న బాధితురాలు మరణించింది.

ఐతే బాధితురాలిపై అత్యాచారం జరగలేదని.. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రకటించారు. ‘యువతి మీద అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చింది. పోస్టు మార్టం నివేదిక ప్రకారం బాధితురాలు మెడ మీద గాయం కారణంగా చనిపోయింది. ఆమె శరీరం మీద వీర్యం ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలిపింది. అలాగే, ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా తన మీద అత్యాచారం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం కొట్టారని మాత్రమే చెప్పింది.’ అని ఏడీజీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని... అలాంటి వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసు అలహాబాద్ హైకోర్టు సుమోటోగా తీసుకొని.. రాష్ట్ర ఉన్నతాధికారులకు నోటీసులు పంపింది. అక్టోబరు 12న కోర్టుకు హాజరై హత్రాస్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అడిషనల్ డీజీపీకి జస్టిస్ రంజన్ రాయ్, జస్టిస్ జస్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం సమన్లు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ కూడా కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా అర్ధరాత్రి తర్వాత బాధితురాలి అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుకు తమ వాదనలను వినిపించాలని బాధితురాలి తల్లిదండ్రులకు కూడా అవకాశమిచ్చింది. వారు కోర్టుకు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

గ్యాంగ్ రేపు విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదనే ఆరోపణలు వినిపించడంతో.. యూపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. హాథ్రస్ ఘటన విచారణను సీబీఐకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: October 7, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading