కోల్‌కత్తా: యువతపై ఆన్‌లైన్ గేమ్స్ (Online Games) ఎంతటి ప్రభావం చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కాలక్షేపం చేయడం తప్పోఒప్పో పక్కన పెడితే అదే ప్రపంచంగా బతకడం మాత్రం ముమ్మాటికీ తప్పే. కరోనా (Corona) కారణంగా స్కూల్స్, కళాశాలలు గత రెండేళ్లుగా తెరవకపోవడంతో స్కూల్ విద్యార్థులకు, కాలేజీ యువతకు స్మార్ట్‌ఫోనే (SmartPhone) ప్రపంచమైపోయింది. వీళ్లలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారారు. అలా ఆన్‌లైన్ గేమ్స్ మోజులో పడి తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించడం, ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు తగలెయ్యొద్దని తల్లిదండ్రులు చెబితే ఆత్మహత్యల వరకూ వెళుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుభదీప్ ఘోషల్(21) అనే యువకుడు చదువులో ముందుడేవాడు. రెండేళ్ల క్రితం ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో శుభదీప్‌కు అతని తండ్రి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఆ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి కరోనా, లాక్‌డౌన్ కారణంగా శుభదీప్ ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే సమయంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. ‘ఫ్రీ ఫైర్’ (Free Fire) అనే ఆన్‌లైన్ గేమ్‌కు బానిసగా మారాడు. మెల్లిమెల్లిగా స్నేహితులకు దూరమయ్యాడు. బంధువుల ఇళ్లకు వెళ్లడమే మానేశాడు. అర్ధరాత్రి వరకూ ‘ఫ్రీ ఫైర్’ (Free Fire) ఆడుతూనే ఉండేవాడు. తల్లిదండ్రులు నిద్రపొమ్మని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. రాత్రంతా గేమ్స్ ఆడుతూ మేల్కొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పడుకునేవాడు. ఈ మధ్య గేమ్ కోసం లక్ష రూపాయల డబ్బు కావాలని అడిగాడు. అప్పటికే చాలాసార్లు డబ్బులిచ్చిన తల్లిదండ్రులు అంత డబ్బు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇకనైనా ఆ ఫోన్‌లో ఆటలు కట్టిపెట్టాలని సూచించారు.
ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన శుభదీప్ రాత్రి భోజనం చేశాక తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఎంతసేపయినా టిఫిన్‌కు కూడా లేవకపోవడంతో కుటుంబ సభ్యులు పిలిచారు. తలుపు కొట్టారు. శుభదీప్ నుంచి స్పందన లేదు. తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. శుభదీప్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. 21 ఏళ్ల వయసులో కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అసలు ఆ ఫోనే కొనివ్వకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అతని తండ్రి రోదించిన తీరు కలచివేసింది. శుభదీప్‌కు ఇద్దరు తోడబుట్టిన వాళ్లు ఉన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Student suicide, West Bengal