యువ రెజ్లర్, జూనియర్ నేషనల్ చాంపియన్ సాగర్ దండక్ (Sagar Dandak) హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (Susheel Kumar) గత మూడు వారాలుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ఏరియాలో మే 4వ తేదీ రాత్రి సుశీల్ కుమార్ అతడి స్నేహితులు కలసి సాగర్ దండక్, అతడి స్నేహితులపై హాకీ స్టిక్స్, బేల్ బాల్ బ్యాట్లతో దారుణంగా దాడి (Physical Brawl) చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఘటనా స్థలం నుంచి పారిపోయిన సుశీల్ కుమార్.. తనకు హత్యతో సంబంధం లేదంటూ మే 5న ఒక వార్తా సంస్థలకు వివరించాడు. కానీ పోలీసులు కనుగొన్న ఒక మొబైల్ వీడియోలో సుశీల్ స్వయంగా దాడి చేస్తున్నట్లు కనపడింది. అప్పటి నుంచి పోలీసులు ఢిల్లీ, హర్యాణ తదితర ప్రాంతాల్లో పూర్తిగా గాలించిన సుశీల్ కుమార్ జాడ కనపడలేదు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సుశీల్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఈ వారంలోనే ఢిల్లీ లోని రోహిణి కోర్టులో సుశీల్ కుమార్ తన లాయర్ల ద్వారా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ సుశీల్ పిటిషన్‌ను అదనపు సెషన్స్ జడ్జి తిరస్కరించాడు. దీంతో సుశీల్ వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ప్రకటించారు.
కాగా, హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సుశీల్ కుమార్ మీరట్ టోల్ ప్లాజాను దాటిన వీడియోను గుర్తించారు. ఒక కారులో వైట్ షర్ట్, మాస్క్ ధరించి ముందు సీటులో కూర్చున్న వ్యక్తి సుశీల్ కుమారే అని పోలీసులు చెబుతున్నారు. ఆ కారును ఒక ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి నడుపుతున్నాడు. ఇప్పుడు పోలీసులు ఆ కారుతో పాటు, డ్రైవింగ్ చేసిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు దొరికితే సుశీల్ కుమార్ ఆచూకీ లభ్యమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో సుశీల్ కుమార్ హరిద్వార్‌లోని ఒక యోగా గురువు ఆశ్రమంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మీరట్ నుంచి హరిద్వార్ కేవలం 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారులో రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. మే 6న మీరట్ టోల్ ప్లాజా దాటిన సుశీల్ కుమార్ హరిద్వార్ వైపే వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టనున్నారు.
సుశీల్ కుమార్‌ను సాగర్ దండక్ ఒక గురువుగా భావించే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా కాలంపాటు ఛత్రాసాల్ స్టేడియం సమీపంలోని మోడల్ కాలనీలో సుశీల్ కుమార్ ఇంటిలోనే సాగర్ అద్దెకు ఉండే వాడు. కానీ ఇద్దరి మధ్య విభేదాలతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 'ఏవైనా గొడవలు ఉంటే సాగర్‌ను ఛత్రాసాల్ స్టేడియం నుంచి బయటకు పంపాల్సింది.. కానీ ఇలా ప్రాణాలు తీసుకొని మాకు కడుపు కోత మిగిల్చాడు' అని సాగర్ తండ్రి భోరున విలపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi police, Susheel kumar, Wrestling