హోమ్ /వార్తలు /క్రైమ్ /

Susheel Kumrar : స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారంటే..!

Susheel Kumrar : స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారంటే..!

సుశీల్ కుమార్

సుశీల్ కుమార్

సాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ రెండు వారాలుగా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఢిల్లీ పోలీసులు 8 బృందాలుగా విడిపోయి అతడి కోసం గాలించగా చివరకు జలంధర్ సమీపంలో ఆచూకీ కనుగొన్నారు.

భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలంపిక్ పతకాలు గెలిచిన సుశీల్ కుమార్ (Susheel Kumar) యువ రెజ్లర్ సాగర్ దండక్ (Sagar Dandak) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మే 4న చత్రాసాల్ స్టేడియం వద్ద సాగర్‌పై దాడి చేసిన అనంతరం సుశీల్ కుమార్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. రెండు వారాలుగా ఢిల్లీ పోలీసులు (Delhi Police) వారి కోసం తీవ్రంగా గాలించారు. మే 4 నుంచి అజ్ఞాతంలో ఉన్న సుశీల్ కుమార్, అతడి స్నేహితుడు అజయ్ కుమార్‌ను పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. 'సాగర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న సుశీల్ కుమార్, అతడి స్నేహితుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు జలంధర్ సమీపంలో అరెస్టు చేశారు' అని ఐయాన్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా, సుశీల్ కోసం ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మే 18న సుశీల్ కుమార్ తన లాయర్ ద్వారా ఢిల్లీలోని రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. కానీ, కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది.

మరోవైపు సుశీల్ కుమార్ మీరట్ సమీపంలోని టోల్ ప్లాజా సీసీ టీవీ ఫుటేజీలో కనిపించాడు. దీంతో అతడు హరిద్వార్ వైపు పారిపోయి ఉంటాడని ఢిల్లీ పోలీసులు అటువైపు కూడా విస్తృతంగా గాలించారు. చివరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో అతడి ఆచూకీని కనుకొన్నారు. సుశీల్ కుమార్, అజయ్ కుమార్‌లను ప్రస్తుతం ఢిల్లీ తీసుకొని వస్తున్నారు. సుశీల్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు మాత్రం ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం అతడి అరెస్టు చూపించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


కాగా, చత్రాసాల్ స్టేడియంలో గత 20 ఏళ్లుగా సుశీల్ కుమార్ శిక్షణ పొందుతున్నాడు. అంతే కాకుండా యువ రెజ్లర్లకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇటీవల ఫ్రి స్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో అతడు టోక్యో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయాడు. చత్రాసాల్ సమీపంలో సుశీల్‌కు ఒక ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇంట్లోనే సాగర్ దండక్ అద్దెకు ఉండేవాడు. మొదట్లో ఇద్దరూ గురు-శిష్యుల్లాగ చాలా కలసి మెలిసి ఉండేవారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ క్రమేపీ వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని.. ఆ క్రమంలోనే మే 4న ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది. తన గురువుగా భావించిన సుశీల్ చేతిలోనే సాగర్ ప్రాణాలు కోల్పోవడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

First published:

Tags: Delhi police, Susheel kumar, Wrestling

ఉత్తమ కథలు