Home /News /crime /

Sri Lanka Blasts: యూకే, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివి.. సూసైడ్ బాంబర్‌గా మారి..

Sri Lanka Blasts: యూకే, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివి.. సూసైడ్ బాంబర్‌గా మారి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆత్మాహుతికి పాల్పడిన వాళ్లంతా బాగా చదువుకున్నవాళ్లేనని, ఆర్థికంగా బలపడినవారేనని విజేవర్ధనే తెలిపారు.

    ఈస్టర్ పండుగ అని చర్చిల్లో ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.. అందరూ ఆనందంలో మునిగిపోయారు.. హఠాత్తుగా వరుస పేలుళ్లతో ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించారు.. ఆత్మాహుతి దాడులతో హోరెత్తించి వందలాది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. విదేశీయులను హతమార్చాలని లగ్జరీ హోటళ్లకు వెళ్లి పేలుళ్లకు పాల్పడ్డారు. మొత్తంగా ఎనిమిది చోట్ల ఒకదాని తర్వాత మరో పేలుడు.. ఇదీ శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం చోటుచేసుకున్న దారుణ మారణహోమం. నరరూప రాక్షసుల వికటాట్టహాసానికి లంక భీతిల్లింది. ఇంతటి దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులు ఎవరు? ఎందుకీ చర్యకు పాల్పడ్డారు? అంటే.. న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే ఈ దాడులకు తెగబడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆ దేశ సర్కారు చెబుతోంది.

    అయితే, ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు మంచి విద్యావంతుడని శ్రీలంక రక్షణ సహాయ మంత్రి రువాన్ విజేవర్ధనే తెలిపారు. అతడు యూకేలో విద్యనభ్యసించి, ఆస్ట్రేలియాలో పోస్ట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, శ్రీలంకలో స్థిరపడేందుకు వచ్చాడని వెల్లడించారు. అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నపుడే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆత్మాహుతికి పాల్పడిన వాళ్లంతా బాగా చదువుకున్నవాళ్లేనని, ఆర్థికంగా బలపడినవారేనని వివరించారు. అందులో ఇల్హామ్ ఇబ్రహీం, ఇన్సాఫ్ అనే ఇద్దరు ఓ వ్యాపారి కుమారులని పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ వారెవరికీ ఐఎస్ ఉగ్రవాద సంస్థతో లింకులు లేవని స్పష్టం చేశారు.

    ఇంటెలిజెన్స్ సంస్థలు సరైన సమయంలో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఉంటే దాడులు జరిగి ఉండేవి కావని విజేవర్ధనే తెలిపారు. ఇప్పటి వరకు 60 మందిని అరెస్టు చేశామని, అందులో 32 మంది పోలీసుల కస్టడీలో ఉన్నారని, వారంతా శ్రీలంకకు చెందినవారేనని వెల్లడించారు.

    ఇక, బుధవారం నాటికి మృతుల సంఖ్య 359కి చేరింది. అందులో విదేశీయులు 38 మంది ఉండగా, అందులో 10 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
    First published:

    Tags: Bomb blast, Columbo Bomb Blast, India, Sri Lanka, Sri Lanka Blasts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు