మిర్యాలగూడ: మృత్యువు ఎవరికి ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి దాకా స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఇంటికెళ్లిన కుర్రాడు గుండెపోటుతో చనిపోయిన ఘటనలున్నాయి. సరదగా అలా స్నేహితులతో బైక్‌పై వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లినవారూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఓ యువకుడి జీవితంలో కూడా ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. అప్పటిదాకా సరదాగా స్నేహితులతో ముచ్చటించాడు. బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు వెళుతుండగా మృత్యువు కబళించింది. దీంతో.. ఆ యువకుడికి 24 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన చెన్నబోయిన లక్ష్మీనారాయణ(24) అనే యువకుడికి బైక్ ఉంది. రోజూలానే బుధవారం రాత్రి కూడా సరదాగా ఫ్రెండ్స్‌తో మాట్లాడి బైక్‌లో పెట్రోల్ తక్కువగా ఉండటంతో శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు బయల్దేరాడు. బైక్‌పై నెమ్మదిగానే వెళుతున్నాడు. ఆ సమయంలోనే.. శెట్టిపాలెం శివారులోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి పక్కన ఉన్న మహాతేజ రైస్‌మిల్ దగ్గరకు లక్ష్మీనారాయణ రాగానే వెనుక నుంచి వచ్చిన కారు అతని బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమైంది. కొంతసేపటికే ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిసింది. లక్ష్మీనారాయణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. లక్ష్మీనారాయణ అక్క ఉమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటిదాకా.. తమతో సరదాగా గడిపిన లక్ష్మీనారాయణ ఇక లేడనే వార్తను అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో మంచిగా ఉంటూ నలుగురితో కలిసిపోయే లక్ష్మీనారాయణ చనిపోవడంతో కాల్వపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా.. జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నేరడుగొమ్ము మండలం పలుగుతండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాతికేళ్ల యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. గురువారం మధ్యాహ్నం పలుగుతండా సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న సేవ్య అనే యువకుడు తీవ్ర గాయాలు కావడంతో కొంతసేపటికే మృతి చెందాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Crime news, Miryalaguda, Nalgonda, Telangana crime news