ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కన్నబిడ్డ కోసం ఓ తల్లి గూఢచారిగా మారింది. తన కొడుకు సైకిల్‌ను దొంగిలించిన వారిని చాకచక్యంగా ఆ పిల్లాడి తల్లి కనిపెట్టింది. కొడుకు కోరుకున్నట్టు తనకు అదే సైకిల్‌ను తిరిగి ఇచ్చింది. కొడుకు ముఖంలో సంతోషం చూసేందుకు ఆ తల్లి చేసిన పని వైరల్‌గా మారింది. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని కృష్ణ కుంజ్ కాలనీలో రాహుల్ అగర్వాల్ అనే వ్యక్తి భార్యా, ఏడేళ్ల కొడుకుతో కలిసి ఉంటున్నాడు. ఏడేళ్ల వయసున్న రాహుల్ కొడుకు అద్విక్ పార్క్‌కు మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఆడుకునేందుకు సైకిల్‌పై వెళ్లాడు. ఆ సైకిల్‌ను బయట పార్క్ చేసి లోపలికి వెళ్లి కొంతసేపు ఆడుకున్నాడు.
ఇంటికి వెళ్లేందుకు తిరిగి వచ్చి సైకిల్ కోసం చూసేసరికి పార్క్ చేసిన దగ్గర కనిపించలేదు. ఎంత వెతికినా సైకిల్ కనిపించకపోవడంతో ఆ పిల్లాడు ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి సైకిల్ కనిపించడం లేదని తల్లి సోనల్ అగర్వాల్‌కు చెప్పాడు. బాబు ఏడుస్తుండటంతో ‘పోతే పోయిందిలే.. డాడీ కొత్త సైకిల్ కొనిస్తాడు నీకు’ అని పిల్లాడికి తల్లి చెప్పింది. అయినప్పటికీ ‘నాకు కొత్త సైకిల్ వద్దు.. ఆ సైకిలే కావాలి’ అంటూ బాబు ఏడుస్తూ కూర్చున్నాడు. భోజనం కూడా చేయలేదు. తన సైకిల్ తెచ్చేదాకా అన్నం తిననని తల్లిదండ్రులకు తెగేసి చెప్పాడు. బాబు బాధ చూసి తల్లి సోనల్ తల్లడిల్లిపోయింది. ఎలాగైనా చోరీ అయిన ఆ సైకిల్‌ను తిరిగి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. ఆ పార్క్ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. టీనేజ్ వయసున్న ఓ పిల్లాడు, అతనితో పాటు స్కూల్ డ్రెస్‌లో ఉన్న మరో పిల్లాడు కలిసి సైకిల్‌ను తీసుకెళ్లిపోవడాన్ని సీసీ ఫుటేజ్‌ల్లో ఆమె గమనించింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ పిల్లలిద్దరూ చిన్నారులు. ఏదో తెలిసీతెలియనితనంతో సైకిల్‌ను తీసుకెళ్లిపోయారని సోనల్ అనుకుంది.
ఆ ఫుటేజ్‌ను తన ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న సోనల్ ఆ పిల్లల ఆచూకీ కోసం అన్వేషణ సాగించింది. చీకటి పడేలోపు ఆ పిల్లలిద్దరూ బల్కేశ్వర్ కాలనీలో ఉంటారని తెలుసుకుంది. స్కూల్ డ్రస్‌ను బట్టి ఆ పిల్లాడు ఎవరో కనుక్కుని మరో పిల్లాడిని కూడా వెతికి పట్టుకుని సైకిల్ ఎక్కడని అడిగింది. పిల్లలిద్దరూ భయంభయంగా ఆ సైకిల్‌ను 250 రూపాయలకు తుక్కు సామాను అతనికి అమ్మేశామని చెప్పారు. ఎవరికి అమ్మారో చూపించడంతో అక్కడికి వెళ్లి అతనిని సైకిల్ ఏదని నిలదీసింది. తొలుత ఏం సైకిల్ అని ఆ వ్యక్తి బుకాయించినా పోలీసులు సీన్‌లోకి ఎంటర్ కావడంతో తుక్కు షాపు యజమాని నిజం ఒప్పుకున్నాడు. ఆ సైకిల్‌ను తిరిగిచ్చేశాడు. సైకిల్‌ను ఇంటికి తీసుకొచ్చి కొడుకు కళ్లలో ఆనందం చూసింది సోనల్ అగర్వాల్. ఆ సైకిల్‌పై ఎక్కి తల్లితో కలిసి ఆ బుడ్డోడు ఫొటోలకు ఇలా ఫోజులిచ్చాడు. కొడుకు సంతోషం కోసం ఒక తల్లిగా సోనల్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. సైకిల్‌ను దొంగతనం చేసిన ఆ ఇద్దరిపై పోలీసులకు సోనల్ ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agra, Mother, Son, Uttar pradesh