SON GOING TO DUBAI AND HIS PARENTS TORTURE AND HARASSMENT BY DAUGHTER IN LAW SSR
చిత్తూరు: కోడలా.. కోడలా.. కొడుకు పెళ్లామా.. నీ మనసు ఇంత కఠినమా.. మరీ ఇంత దుర్మార్గమా..!
ఇంటి బయట వృద్ధ దంపతులు
రోజురోజుకూ సమాజంలో మానవీయత కనుమరుగైపోతుంది. బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతున్న రోజులివి. ఆస్తి కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా దిగజారుతున్నారు. తల్లిదండ్రుల్లా చూసుకోవాల్సిన అత్తమామలను అత్యంత హీనంగా చూస్తూ వారిని తీవ్ర మనోవేదనకు...
చంద్రగిరి: రోజురోజుకూ సమాజంలో మానవీయత కనుమరుగైపోతుంది. బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతున్న రోజులివి. ఆస్తి కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా దిగజారుతున్నారు. తల్లిదండ్రుల్లా చూసుకోవాల్సిన అత్తమామలను అత్యంత హీనంగా చూస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. అత్తాకోడళ్ల మధ్య చిన్నచిన్న గొడవలు సహజం. కానీ.. ఈ చిన్నచిన్న గొడవలే వేరు కాపురాలకు కారణమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే ఉమ్మడి కుటుంబాలు చిన్నచిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. కలిసి ఉండి తిట్టుకుంటూకొట్టుకుంటూ ఉండే కంటే విడిగా ఉండి అప్పుడప్పుడూ కలుస్తూ ఆనందంగా ఉంటే చాలనుకునే ఈ రోజుల్లో అత్తమామను నడిరోడ్డున పడేసిన ఓ కోడలి కర్కశం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. చంద్రగిరి మండలం బి కొంగరవారి పల్లిలో అమానుషం జరిగింది. భర్త దుబాయ్‌కి వెళ్లగానే అత్తమామలను కోడలు బయటకు గెంటేసింది. డబ్బు సంపాదన కోసం కొడుకు దుబాయ్‌కి వెళ్ళాడు. వెళ్తూవెళ్తూ తన భార్యను ఒంటరితనం వెంటాడకూడదన్న ఉద్దేశంతో ఆమెకు తోడుగా అమ్మానాన్నలను ఉంచి వెళ్ళాడు. భర్త దుబాయ్‌కు వెళ్లిపోగానే ఆ కోడలిలో కర్కశం నిద్రలేచింది. కన్నోళ్లలా చూసుకోకపోవడం మాట అటుంచితే, కనీసం అత్తమామలుగా వారికి కనీస గౌరవం ఇవ్వలేదు. వృద్ధులనే కనికరం కూడా లేకుండా ఇంటి నుంచి బయటకు గెంటివేసింది. ఇంటికి తాళం వేసి.. వృద్ధ దంపతులు ఇంట్లోకి రాకుండా తాళం వేసింది. దీంతో.. ఆ వృద్ధులకు నిలువ నీడ లేకుండా పోయింది.
నడి ఎండలో కూడా నడిరోడ్డుపైనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. కోడలి ఇంటి నుంచి గెంటేసిన విషయం పక్కన పెడితే.. తెలిసిన వాళ్లు గానీ, బంధువులు గానీ ఆ వృద్ధులను చూసుకునేందుకు కనీసం ముందుకు రాకపోవడం బంధాలు, బంధుత్వాలు ఈరోజుల్లో ఎలా ఉన్నాయో రుజువు చేసింది. ఈ వృద్ధులే ఆర్థికంగా స్థితిమంతులై ఉండి.. ఆస్తి పెడతామని.. చూసుకోమంటే బంధువులు రాబందుల్లా వాలేవారని స్థానికులు వాపోతున్నారు. ఈ వృద్ధ దంపతులు రోడ్డున పడి దాదాపు 15 రోజులవుతోంది. ఈ తల్లిదండ్రుల పడుతున్న బాధ గురించి ఆ కొడుకుకు తెలుసోలేదో కూడా తెలియదు.
తిండితిప్పలు లేకుండా ఎవరైనా జాలి చూపి అన్నం పెడితే తిని ఇంటి ముందే పడుకుంటున్నారు. ఎటుపోవాలో తెలియదు. చేరదీసి చూసుకునే వారే లేరు. కోడలి మనసు మారకపోతుందా.. ఇంట్లోకి రమ్మనకపోతుందా అన్న ఆశతో ఆ ముసలి ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి. అయినా ఆ కోడలి మనసు కరగకపోవడం శోచనీయం. ఆమెకు మనసుందో లేక ఆ గుండె బండలా మారిందో తెలియదు గానీ ఈ వృద్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఎవరైనా తమ కోడలితో మాట్లాడి సాయం చేయకుండా పోతారా అని నిరీక్షిస్తున్న ఈ వృద్ధుల కోసం ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. బయట ఊరికి వెళ్లాలంటే ఎలా బ్రతకాలో తెలియదు. సొంతూళ్లోనే తమ గోడు వినే మనుషులు లేకపోతే ఇక పక్క ఊరికి వెళ్లినా ఫలితం ఉండదని ఈ వృద్ధులు భావిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.