SOFTWARE EMPLOYEE HARASSMENT TO HYDERABAD WIFE ABOUT REMOVING PREGNANCY LEADS TO SHOCKING TWIST HSN
నువ్వు అప్పుడే తల్లివి కావడం నాకిష్టం లేదు.. గర్భం తీసేయిస్తా.. భార్యకు తేల్చిచెప్పిన టెకీ.. వాట్సప్ లో ఫస్ట్ నైట్ వీడియోను పంపి..
ప్రతీకాత్మక చిత్రం
వారిద్దరూ కరోనాకు ముందే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చెన్నైలో కాపురం పెట్టారు. అయితే కొద్ది నెలల్లోనే ఆ యువతి గర్భవతి అయింది. ఇప్పుడే పిల్లలు అవసరం లేదనీ, గర్భాన్ని తీసేయించుకోవాలని భార్యకు ఆ భర్త చెప్పాడు. కానీ..
రోజురోజుకు సమాజంలో స్త్రీలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, దిశ, నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా మృగాళ్లు మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. భర్తల చేతుల్లో వేధింపులకు గురవుతున్న భార్యల సంఖ్య కోకొల్లలంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ భర్త తన భార్యను మానసికంగా హింసించాడు. గర్భాన్ని తీసేయించమని కోరాడు. వినకపోవడంతో శోభనం నాటి నుంచే రహస్యంగా చిత్రీకరించిన తమ శృంగార కార్యకలాపాల వీడియోలతో ఆమెను బెదిరించాడు. భయభ్రాంతులకు గురి చేశాడు. ఆమె చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. అప్పటికే అతడికి మరో రెండు పెళ్లిళ్లు అయ్యాయన్న నిజం ఆమెకు తెలిసి షాకయింది. హైదరాబాద్ యువతికి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమెకు చెన్నైలోని తాంబరంలో నివాసం ఉంటున్న సబిక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆన్ లైన్ లోనే పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. చివరకు వారిద్దరూ కరోనాకు ముందే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చెన్నైలో కాపురం పెట్టారు. అయితే కొద్ది నెలల్లోనే ఆ యువతి గర్భవతి అయింది. ఇప్పుడే పిల్లలు అవసరం లేదనీ, గర్భాన్ని తీసేయించుకోవాలని భార్యకు ఆ భర్త చెప్పాడు. అయితే ఆమె మాత్రం ససేమిరా అంది. మాటి మాటికి అతడి నుంచి అదే పనిగా వేధింపులు మొదలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్ లోని తన పుట్టింటికి వచ్చేసింది.
కాపురానికి రావాలనీ, తాను చెప్పినట్టు గర్భాన్ని తీసేయించుకోవాలని ఫోన్లోనే సబిక్ భార్యను బెదిరించేవాడు. ఇక ఆఖరు ఆస్త్రంగా ఆమె వాట్సప్ నెంబర్ కు కొన్ని వీడియోలను పంపించాడు. శోభనం నాటి నుంచి రహస్యంగా తీసిన శృంగార కార్యకలాపాల వీడియోల శాంపిల్ ను అతడు ఆమెకు పంపించాడు. ‘నేను చెప్పినట్టు వినకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతా. నీ పరువు పోతుంది’ అంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె చెన్నైలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ భర్తను పట్టుకున్నారు. అతడిని విచారిస్తే మరో షాకింగ్ నిజం తెలిసింది. అతడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయన్న నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.