రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ అందరి జీవితాలలో కొత్త క్రాంతులు నింపాలని దేవుడిని కోరుకుంటారు. కానీ ఒక కుటుంబానికి మాత్రం ఈ సంక్రాంతి చీకటి నింపింది. పండగ పూట ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. అప్పటిదాకా తల్లిదండ్రుల వద్దే ఉన్న ఆ బాబును మృత్యువు గాలిపటం రూపంలో కబళించింది. ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన పండగ రోజు ఆ కుటుంబంలో రోధనలు మిన్నంటాయి. చిన్నపిల్లలని కుటుంబసభ్యులు ఓ కంట కని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా లోని దేవునిపల్లిలో చోటు చేసుకుందీ విషాదం. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
దేవునిపల్లి గ్రామంలో గల 35 వ వార్డులో నివాసముంటున్న పొంగలనేని మధుకృష్ణ, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు నిశాంత్, ప్రజ్వల్. మధుకృష్ణ, సుజాతలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అయితే గురువారం సంక్రాంతి పండగ కావడంతో పెద్ద కుమారుడు నిశాంత్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గాలిపటంతో ఆడుకుంటూ బయటకు వెళ్ళాడు. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. రాత్రి వరకు వెతికినా బాలుడు కనిపించలేదు.

బాలుడిని బలి తీసుకున్న గుంత ఇదే....
దీంతో వాళ్లు భయాందోళనకు గురై.. పోలీసులకు ఫిర్యాదు చేసారు. అంతేగాక వాట్సాప్ గ్రూపులలో బాబు ఫోటోలో పోస్ట్ చేసి, ఈ బాలుడు మిస్ అయ్యాడని... కనిపిస్తే ఆచూకీ తెలపాలని షేర్ చేశారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఇంటి పక్కనే గల మురికి కుంటలో నిశాంత్ శవమై తేలాడు. ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి పక్కనే డ్రైనేజి కోసం తవ్విన గుంత బాబుని బలిగొనడంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిశాంత్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Published by:Srinivas Munigala
First published:January 15, 2021, 21:27 IST