Six days before wedding: ఆరు రోజుల్లో కూతురి పెళ్లి.. శుభలేఖలు పంచొస్తుంటే రోడ్డు పక్కన కూతురి శవం.. చంపిదెవరో తెలిసి షాకైన తండ్రి !

రోడ్డు పక్కన టీనా మృతదేహం, ఇన్‌సెట్‌లో టీనా ఫైల్ ఫొటో

లాల్‌పూర్ పిపల్‌సన గ్రామానికి చెందిన మదన్ పాల్ సింగ్ కుమార్తె టీనా అలియాస్ మీనాక్షి(19). బిజ్‌నూర్ జిల్లా అఫ్జల్‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలగర్ గ్రామానికి చెందిన జతిన్ సింగ్‌తో మీనాక్షి పెళ్లి నిశ్చయించారు. జూన్ 20న ముహూర్తం పెట్టుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.

 • Share this:
  మొరదాబాద్: మరో ఆరు రోజుల్లో కూతురి పెళ్లి. జూన్ 20న అమ్మాయి పెళ్లి పెట్టుకున్న ఆ తండ్రి బంధుమిత్రులకు శుభలేఖలు పంచి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఇంతలో రోడ్డుపై.. జనం గుమిగూడి ఉండటాన్ని గమనించాడు. పోలీసులు కూడా ఉన్నారు. ఏమైందో చూద్దామని అక్కడి ఆగి.. పోలీసులను ఏమైందని అడిగాడు. ఓ పద్దెనిమిది, పంతొమ్మిది ఏళ్ల వయసున్న యువతి చనిపోయి పడి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహంపై పోలీసులు గుడ్డ కప్పడంతో చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. శరీరం మొత్తం పాలిపోయిన రంగులో ఆ పెద్దాయనకు కనిపించింది. ‘ఒక్కసారి ఆ చనిపోయిన అమ్మాయి ముఖం చూడొచ్చా సార్’ అని పోలీసులను అడగ్గా.. వాళ్లు కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆయన ఒత్తిడి చేయడంతో పోలీసులు ఆ మృతదేహం ముఖంపై కప్పిన గుడ్డను తీసి చూపించారు. ఆ యువతి ముఖం చూసిన ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. తాను ఏది జరగకూడదని కోరుకున్నాడో ఆ దృశ్యమే కళ్ల ముందు కనిపించింది. ఆ యువతి మరెవరో కాదు ఆయన కూతురే. మరో ఐదు రోజుల్లో కూతురి పెళ్లి. ఆ సంతోషంలో అయినవాళ్లందరికీ శుభలేఖలు పంచి వస్తున్న తండ్రి. ఆ క్షణానికి కూడా కూతురి పెళ్లి శుభలేఖలు ఆ కన్నతండ్రి చేతిలోనే ఉన్నాయి. విగత జీవిగా రోడ్డు పక్కన గుర్తుపట్టలేని విధంగా పడి ఉన్న కూతురి మృతదేహాన్ని చూసి ఆ తండ్రి గుండె బద్ధలైంది. ఆ యువతి తన కూతురేనని పోలీసులకు చెప్పి ఆ తండ్రి భోరున విలపించాడు. ఆనకట్ట తెగిన నది నీటిలా ఆ తండ్రి కళ్ల నుంచి కన్నీరు ధారలా ఉబికివస్తోంది. ప్రాణం లేని కూతురి దేహాన్ని ఒడిలోకి తీసుకున్న ఆ తండ్రికి దు:ఖం పొంగుకొస్తోంది. బాధాతప్త హృదయంతో కూతురిని ఆ స్థితిలో చూస్తూ... ‘నా చేతులతో నీకు మెహందీ పెడదామనుకున్నా తల్లీ.. కానీ ప్రాణం లేని స్థితిలో నువ్వు.. నిర్జీవంగా ఉన్న నీ శరీరమంతా ఇలా పాలిపోయి కనిపిస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మా’ అని ఆ కన్న తండ్రి ఏడుస్తుంటే అక్కడున్న వారి కళ్లు కన్నీటితో నిండిపోయాయి.

  ఒక చేతిలో కూతురి పెళ్లి శుభలేఖలు, మరో చేతిలో విగత జీవిగా రోడ్డుపై పడి ఉన్న కన్న కూతురు.. ఇలాంటి పరిస్థితి ఏ కన్నతండ్రికి రాకుడదు. పగ వాడికి కూడా రాకూడని కష్టమిది. ఏ కన్నతండ్రీ అనుభవించకూడని వర్ణనాతీతమైన వేదన ఇది. కూతురి మరణ వార్త గురించి తెలుసుకున్న ఆమె తల్లి కూడా అక్కడికి చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా విలపించింది. ఈ ఘటన.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ పరిధిలోని సుర్జన్ నగర్ తాలూకాలోని ఠాకూర్‌ద్వార పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాలాపూర్ పిపల్‌సన గ్రామంలో జూన్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆ యువతిని హత్య చేసింది ఆమెకు కాబోయే భర్తే అని తెలిసి పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌పూర్ పిపల్‌సన గ్రామానికి చెందిన మదన్ పాల్ సింగ్ కుమార్తె టీనా అలియాస్ మీనాక్షి(19). బిజ్‌నూర్ జిల్లా అఫ్జల్‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలగర్ గ్రామానికి చెందిన జతిన్ సింగ్‌తో మీనాక్షి పెళ్లి నిశ్చయించారు. జూన్ 20న ముహూర్తం పెట్టుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. రెండు కుటుంబాల వారు బంధుమిత్రులకు శుభలేఖలు పంచుతున్నారు.

  ఇది కూడా చదవండి: Married Woman: ఎంతపని జరిగింది తల్లీ.. పండంటి మగబిడ్డను కన్న రెండు నెలలకే.. ఇంతలోనే ఇలా..

  ఇలా పెళ్లి పనుల్లో కాబోయే భార్యాభర్తల కుటుంబాలు బిజీగా ఉండగా జూన్ 14న కాబోయే పెళ్లి కొడుకు జతిన్ సింగ్ తనకు కాబోయే భార్య అయిన టీనా వాళ్ల ఊరెళ్లాడు. టౌన్‌కు వెళ్లి షేర్వాని కొందామని, ఆ షేర్వాణిని నువ్వే సెలక్ట్ చేయాలని టీనాను బైక్‌పై ఎక్కించుకుని జతిన్ బయటకు తీసుకెళ్లాడు. సుర్జన్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ షాప్‌లో ఆమెతో కలిసి షేర్వాణి కొన్నాడు. ఉదయం 11 గంటలకు ఆమెను బయటకు తీసుకెళ్లిన జతిన్ సింగ్ తిరిగి సాయంత్రం ఆమెను ఊరిలో దిగబెట్టేందుకని బయల్దేరాడు. కానీ.. దారి మధ్యలో బైక్ ఆపి సాయంత్రం ఆమెను హతమార్చాడు. సాయంత్రం 3 గంటల సమయంలో రోడ్డు పక్కన వెళుతున్న గ్రామస్తులు టీనా మృతదేహాన్ని గమనించారు. టీనాతో పెళ్లి ఇష్టం లేకే జతిన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు 24 గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేసి.. నేరం రుజువు కావడంతో జైలుకు పంపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు షాక్‌కు లోనయిన పరిస్థితి.

  టీనా సోదరుడు దిషూ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్కసారి చెప్పినా.. అంతటితో దూరం జరిగేవాళ్లమని.. తన సోదరి బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంతో గానీ, వాళ్ల కుటుంబంతో గానీ ఒక్కమాట చెప్పినా పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిని రద్దు చేసుకునేవాళ్లమని చెప్పాడు. టీనా తల్లి మాట్లాడుతూ.. టీనాకు ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే అతని వెంట పంపేదానినే కాదని కన్నీరుమున్నీరయింది. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. టీనా హత్యకు జతిన్ సింగ్‌కు తన సోదరుడు కూడా సహకరించాడు. అతనిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: