కొత్తమంగళం: కేరళలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని మానస హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) 200 పేజీల ఛార్జ్‌షీట్‌ను కొత్తమంగళం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం నాడు సమర్పించింది. ఈ ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా మానసను హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రఖీల్ పేరును పేర్కొంది. ఏ2 నిందితుడిగా ఆదిత్యన్ ప్రదీప్(27) పేరును చేర్చింది. మానసను కాల్చి చంపేందుకు వినియోగించిన గన్ను కొనేందుకు రఖీల్కు సహకరించింది ప్రదీప్ కావడం గమనార్హం. ఇక.. గన్ సప్లయ్ చేసిన బీహార్ వాసి సోనూ కుమార్ (22) అనే యువకుడి పేరును ఏ3 నిందితుడిగా ఛార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది. ఈ కేసులో 81 మంది సాక్ష్యులుగా ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు నివేదించింది.
మానస హత్య కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. కొత్త మంగళంలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో పీవీ మానస అనే విద్యార్థిని ఉండేది. ఆమెను రఖీల్ (32) అనే ఓ యువకుడు ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతుండేవాడు. ఇద్దరిదీ కన్నూర్ జిల్లానే కావడం గమనార్హం.
కాలేజ్‌కు దగ్గరలోని ఓ అద్దె ఇంట్లో క్లాస్‌మేట్స్‌తో కలిసి మానస ఉండేది. తన ప్రేమను మానస పట్టించుకోవడం లేదని రఖీల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను చంపాలన్న ఉద్దేశంతో కన్నూర్ నుంచి కొత్తమంగళం వెళ్లాడు. మానస ఉంటున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు. మానసను జుట్టు పట్టుకుని గదిలో నుంచి ఈడ్చుకొచ్చి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన మానస ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు.
ఏం జరిగిందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో మానస, రఖీల్ బంధానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూశాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, గతంలో ఇద్దరూ స్నేహంగా ఉన్నారని తెలిసింది. అయితే.. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మానస రఖీల్ను దూరంగా పెట్టింది. అప్పటి నుంచి ఆమెకు మళ్లీ దగ్గరయ్యేందుకు రఖీల్ చాలాసార్లు ప్రయత్నించాడు. ఆమె అందుకు నిరాకరించడంతో మానసపై రఖీల్ పగ పెంచుకున్నాడు. చివరికి ఇంత పని చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, Murder, Social Media