ఈ కంప్యూటర్ యుగంలోనూ కొందరు ప్రజలు మూఢనమ్మకాలను వీడడం లేదు. కష్టపడకుండా కాసుల వర్షం కురవాలన్న దుర్భుద్ధితో క్షుద్రపూజలు, గుప్త నిధులు, రెండు తలల పాము అంటూ తిరుగుతున్నారు. కొందరు కేటుగాళ్లు ఇలాంటి మాటలు నమ్మే అమాయకులను టార్గెట్ చేసుకుని లక్షలు వెనకేసుకుంటున్నారు. రెండు తలాల పాము ఉన్న ఇళ్లల్లో ధన వర్షం కురుస్తుందిని, అనారోగ్యం బాధ పోతుందని, మరెన్నో లాభాలు ఉంటాయన్న ప్రచారం ఎప్పటినుంచి ఉంది. ఈ విషయాన్ని నమ్మే వారికి అమ్మేందుకు ఓ రెండు తలల పామును పట్టుకుని బంధించిన వ్యక్తులను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న మధ్య రాత్రి 2 గంటలకు సిద్దిపేట శివారు నాగదేవత టెంపుల్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు కలసి రెండు తలాల పామును పట్టుకుని దాచి ఉంచారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు వారు వేసుకున్న గుడారాల్లో తనిఖీలు నిర్వహించగా ప్లాస్టిక్ డబ్బాల్లో బంధించిన రెండు తలాల పాము కనిపించింది. వెంటనే పోలీసులు ముగ్గురు నిందితులను, రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై నిందితులను విచారించగా.. రెండు తలాల పాము ఉన్న ఇళ్లల్లో ధన వర్షం కురుస్తుందిని, అనారోగ్యం బాధ పోతుందని, మరెన్నో లాభాలు ఉంటాయని భావించే అనేక మంది అలాంటి పాములను ఎక్కువ డబ్బులకు కొంటారని చెప్పారు. అలాంటి వారి కోసం అమ్మడానికి ఆ పాములను దాచి ఉంచామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితులైన సిద్దిపేట పట్టణానికి చెందిన కాశవేణి తిరుపతి, వికారాబాద్ జిల్లాకు చెందిన వడ్డే శ్రీరాములువ తాండూరుకు చెందిన వడ్డె వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండు తలాల పామును సిద్దిపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. టాస్క్ ఫోర్స్ సీఐ నరసింహారావు, వన్ టౌన్ సీఐ సైదులు, ఎస్ఐ రాజేష్, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వన్ టౌన్ సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని అభినందించారు. వన్యప్రాణులను పట్టుకుని బంధించినా లేదా వేటాడి చంపినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100కు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ రాజేష్, టాస్క్ఫోర్స్ సిబ్బంది శివ కుమార్, నర్సింలు, నవీన్, రాము సతీష్ సాయిబాబా వన్ టౌన్ సిబ్బంది కమలాకర్ రెడ్డి, నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana Police, TS Police